హ్యాట్రిక్ హీరో… వాట్ నెక్స్ట్?

పదేళ్లకు పైగా సరైన విజయం లేక ఇబ్బంది పడ్డ తమిళ స్టార్ హీరో సూర్య.. కేవలం ఆరు నెలల వ్యవధిలో మూడు బ్లాక్ బస్టర్లు కొట్టి అందరినీ షాక్‌కు గురి చేశాడు. వేసవిలో ‘కరుప్పు’తో కెరీర్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇచ్చిన సూర్య.. ఇంకో మూడు నెలలకు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ఘనవిజయాన్నందుకున్నాడు. ఇక లేటెస్ట్‌గా దీపావళికి ‘సీన్’తోనూ మరో పెద్ద హిట్ ఖాాతాలో వేసుకున్నాడు. ఈ మూడు చిత్రాలూ సింపుల్ స్టోరీలతో తెరకెక్కినవే. వేటికవే భిన్నమైనవి. మూడు భిన్నమైన పాత్రల్లో సూర్య చాలా సిన్సియర్‌గా నటించి మెప్పించాడు. 

ఈ సినిమాలు సాధించిన విజయాలతో సూర్య అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఇలాంటి గొప్ప నటుడికి, మంచి మనసున్న వ్యక్తికి ఇలాంటి విజయాలు దక్కడం పట్ల ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరూ సంతోషంగా ఉన్నారు. మరి సూర్య నుంచి ఇక ముందు రాబోయే సినిమాలేవి అన్నది ఆసక్తికర. ఈ విజయాల తర్వాత ఈ హీరో నుంచి ఇంకా పెద్ద రేంజి సినిమాలు ఆశిస్తాం. కానీ అతను కాస్త సింపుల్ సినిమాలే చేస్తున్నాడు.

తనకు ‘జై భీమ్’ లాంటి మరపురాని సినిమాను  అందించిన టీజీ జ్ఞానవేల్‌తో సూర్య మరోసారి జట్టు కట్టాడు. వీరి కలయికలో సినిమా అంటే మళ్లీ సామాజిక అంశాలతో ముడిపడ్డ చిత్రమే అయ్యుంటుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య ఒక డాక్టర్ పాత్ర చేస్తున్నాడట. ‘జై భీమ్’ తర్వాత సూపర్ స్టార్ రజినీతో ‘వేట్టయాన్’ లాంటి వైవిధ్యమైన సినిమానే చేశాడు జ్ఞానవేల్.

అది మంచి చిత్రమే అయినా.. సరిగా ఆడలేదు. అయినప్పటికీ అతను రూటు మార్చకుండా.. సూర్యతో ఒక సామాజిక ప్రయోజనం ఉన్న కథను తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకున్నాడు.  ఆల్రెడీ ఈ చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదలవుతుందట.

ఇంకోవైపు ‘మండాడి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొత్త దర్శకుడు మదిమారన్ పుహళేందితో సూర్య ఒక సినిమా చేయబోతున్నాడు. ‘మండాడి’ తరహాలోనే ఇది కూడా సముద్ర నేపథ్యంలో నడిచే కథేనట. ఇందులో సూర్య నావికుడి పాత్రే చేయబోతున్నాడట. ఆ చిత్రానికి స్క్రిప్టు లాక్ అయింది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. వచ్చే ఏడాది ఈ రెండు చిత్రాలతో సూర్య ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.