అందరూ చేయందించడం అర్జున అదృష్టం  

నిన్న రాత్రి హైదరాబాద్ ఏఎంబీ మల్టీప్లెక్సులో వేసిన ఇట్లు అర్జున ప్రీమియర్ షోకు దాదాపు టాలీవుడ్ మొత్తం హాజరయ్యిందేమో అన్నంత హడావిడి కనిపించింది. చాలా అరుదుగా ఇలాంటి షోలకు వచ్చే వెంకటేష్ సైతం దర్శనమివ్వడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా మంది హీరో హీరోయిన్లు, టెక్నీషియన్లు, సెలబ్రిటీలతో వాతావరణం సందడిగా కనిపించింది. ప్రమోషన్స్ టైం నుంచే లైమ్ లైట్ లో ఉంటూ వచ్చిన ఈ సినిమాకు ఈ స్టార్ అట్రాక్షన్ బాగా ప్లస్సవుతోంది.

హీరో అనీష్ బ్యాక్ గ్రౌండ్ వల్లే ఇంత సపోర్ట్ సాధ్యమనుకున్నా ఎలాంటి స్టార్ ఫ్యామిలీ నుంచి రాకుండా కేవలం వ్యాపార నేపథ్యంతో ఈ స్థాయిలో మద్దతు అనుకోవడం అదృష్టమనే చెప్పాలి. తమన్ లాంటి టాప్ టెక్నీషియన్ ని తీసుకోవడమే కాదు అతని నుంచి బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చేలా చేయించుకోవడం లాంటి ఎన్నో పాజిటివ్ విషయాలు ముందు నుంచి హైలైటవుతూ వస్తున్నాయి. ప్రాథమికంగా వినిపిస్తున్న టాక్ అయితే నెగటివ్ లేదు. చూడొచ్చనే మాట క్రమంగా పెరుగుతోంది.

ఇప్పటికే పలు వాయిదాల తర్వాత మూడు నాలుగు డేట్లు మార్చుకుని వచ్చిన ఇట్లు అర్జునకు బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ కాంపిటీషన్ అయితే ఉంది. డిఎన్ కెకు మార్కెటింగ్ బాగా చేశారు. మౌళి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. రామాయణ, సీన్ రెండో వారంలోనూ హోల్డ్ కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇట్లు అర్జునకు టాక్ చాలా కీలకం కానుంది. దాని తాలూకు ప్రభావం ఎంత ఉందనేది ఈ రోజు సాయంత్రానికి క్లారిటీ వస్తుంది. పికప్ అయితే వీకెండ్ దాకా ఢోకా ఉండదు.

కొంచెం డ్రైగా అనిపించే నవంబర్ నెలలో చెప్పుకోదగ్గ స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమాలు ఎక్కువగా లేదు. దసరా, దీపావళి పండుగలు అయిపోవడంతో బాక్సాఫీస్ కొంచం డ్రైగా ఉంది. ఇట్లు అర్జున ఏ మాత్రం మెప్పించినా అనీష్ కు మంచి డెబ్యూ అవుతుంది. అప్పుడెప్పుడో చిరుత, రాజకుమారుడు, ఈశ్వర్ లాంటి స్టార్ డెబ్యూలకు మాత్రమే కనిపించిన వాతావరణం ఇప్పుడు ఇట్లు అర్జునకు కనిపిస్తోంది. దాన్ని ఏ మేరకు నిలబెట్టుకుంటుందో వీకెండ్ అయ్యాక స్పష్టత వస్తుంది.