రామసీత రావణుల్లో ఎవరికి లాభం

రామాయణ పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉంది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ వెయ్యి కోట్ల మార్కు అందుకుంది. కానీ పుష్ప 2, దురంధర్ 2 ని దాటడం ఎంత వరకు సాధ్యమో ఇప్పుడే చెప్పలేం అంటూ ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బుక్ మై షోలో భీకరమైన ట్రెండింగ్ చూపిస్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో థియేటర్లు ఫుల్ కావడం లేదనే కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దానికి సాక్ష్యంగా కొందరు వీడియోలు పెడుతున్న వైనం ఎక్స్, ఇన్స్ టాలో గమనించవచ్చు.

వసూళ్ల లెక్కలు పక్కనపెడితే ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన ముగ్గురిలో ఎవరికి ఎక్కువ లాభం కలిగిందనే పాయింట్ కు వద్దాం. ముందుగా సాయిపల్లవిని తీసుకుంటే సీతగా ఆమె బాడ్ ఛాయస్ కాలేదు. అలాని బెస్ట్ ఆప్షన్ అనిపించుకోలేదు. డీసెంట్ గా ఉందనే ఫీడ్ బ్యాక్ తప్ప ఆమె తప్ప ఇంకెవరు పోషించలేరనే స్థాయిలో మెచ్చుకోలు రాలేదు. పైగా నార్త్ ఆడియన్స్ కొందరు నెగటివ్ గా కూడా మాట్లాడారు. సో తక్కువ ప్రయోజనం దక్కింది సాయిపల్లవికేనని చెప్పడంలో డౌట్ లేదు.

ఇక రన్బీర్ కపూర్ సంగతి చూస్తే రాముడిగా ఎక్కడ తొణక్కుండా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కథ పరిధి మేరకు తన వరకు ఎంత ఇవ్వాలో అంతా ఇచ్చాడు. అసలైన ఛాలెంజ్ రెండో భాగంలో ఉంటుంది కాబట్టి 2028 దాకా వెయిట్ చేయాలి. ఇక యష్ విషయానికి వస్తే రావణుడిగా తన ఎంపికకి నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. దశకంఠుడికి అంత గడ్డం ఉంటుందా అనే అనుమానం రాకుండా నటనతో మేనేజ్ చేశాడు. స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో మరోసారి తన ముద్ర చూపించాడు.

సో లాభం ఎక్కువ కలిగిన నటుడు యష్ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. మిగిలిన వాళ్ళ విషయానికి వస్తే రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నంతలో ఉనికిని చాటుకోగా కాజల్ అగర్వాల్ కేవలం మొక్కుబడిగా మిగిలిపోయింది. వివేక్ ఒబెరాయ్ గెటప్ వల్ల కామన్ ఆడియన్స్ వెంటనే గుర్తుపట్టలేకపోయారు. అసలైన హనుమాన్ పాత్రధారి సన్నీ డియోల్ ని పార్ట్ 2 కోసం దాచి పెట్టడంతో ఈ లిస్టులోకి చేరలేదు. 2028 దీపావళికి సీక్వెల్ విడుదల కానుంది. ఇంకా కీలక భాగం షూటింగ్ పెండింగ్ ఉందట.