ఇడుపు కాయితం వివాదాలపై క్లారిటీ

ఈ మధ్య చిన్న సినిమాలకు వివాదాలే ప్రచార అస్త్రాలుగా మారుతున్నాయి. ఇడుపు కాయితం అనే చిన్న సినిమా విషయంలో ఇలాగే జరిగింది. టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ టర్న్డ్ యాక్టర్ నాగదుర్గ జంటగా బన్నీ వాసు, తబిత సుకుమార్ ఉమ్మడి నిర్మాణంలో వంశీరెడ్డి దొండపాటి రూపొందించిన ఈ చిత్రం.. మొదలైనపుడే ఓ వివాదం వల్ల వార్తల్లో నిలిచింది. ‘ఇడుపు కాయితం’ అనే టైటిల్ అర్థం కాలేదంటూ ఆంధ్ర వాళ్లు కొంతమంది కామెంట్లు చేయడం, దాని మీద తెలంగాణ వాళ్లు కౌంటర్ ఎటాక్ చేయడంతో ఈ సినిమా అందరి దృష్టిలో పడింది.

తర్వాతేమో ఈ సినిమా నుంచి ఒక పాట లాంచ్ చేసినపుడు.. పెళ్లి వేడుక జరుగుతున్న చోటే అతిథులకు మందు, ముక్క వడ్డించే సన్నివేశం పెట్టడం మీద తెలంగాణలోనే ఒక వర్గం అభ్యంతరపెట్టింది. తెలంగాణ అంటే మందు, ముక్క అనే అభిప్రాయం కలిగేలా సినిమాలు తీస్తున్నారంటూ విమర్శలు గుప్పించిందా వర్గం. రెండో వివాదం మీద తెలంగాణ వారి నుంచే అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో నిర్మాతల్లో ఒకరైన తబిత (సుకుమార్ సతీమణి).. టీజర్ లాంచ్ కార్యక్రమంలో మీడియాకు వివరణ ఇచ్చారు.

పెళ్లి వేడుకల్లో మద్యం పోసి ముక్క పెట్టడం అన్నది తెలంగాణ సంప్రదాయం అని తాము ఎక్కడా చూపించలేదని ఆమె స్పష్టం చేశారు. ఇది తెలంగాణ సంప్రదాయం కాదని ఆమె చెప్పారు. కాకపోతే పెళ్లి జరిగినా, ఇంకో వేడుక అయినా.. పెద్దవాళ్ల మీద గౌరవంతో పక్కన మందు, మటన్ ఏర్పాటు చేస్తుంటారని.. అది మాత్రం తెలంగాణ ప్రాంతంలో చూశానని ఆమె చెప్పారు. ఇది ప్రేమతో, గౌరవంతో చేసే పనులు అని.. పెద్దవాళ్లకు ఫుడ్, మందుకు మించిన ఆనందం ఏముంటుందని ఆమె అన్నారు. అంతే తప్ప దీన్నొక సంప్రదాయంగా చూపించాలన్న ఉద్దేశం తమకు లేదని తబిత స్పష్టం చేశారు.

మరోవైపు బన్నీ వాసు మాట్లాడుతూ.. ‘ఇడుపు కాయితం’ చుట్టూ నెలకొన్న వివాదాలన్నీ తమకు సిల్లీగానే అనిపించాయన్నారు. వివాదం కోసం ఈ టైటిల్ పెట్టడం, పబ్లిసిటీ కోసం వివాదాలు క్రియేట్ చేయడం లాంటివేమీ తాము చేయలేదన్నారు. ‘ఇడుపు కాయితం’ అనే సంప్రదాయం గురించి దర్శకుడు వంశీ చెబితే.. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా అనిపించి, దాని మీద రీసెర్చ్ చేసి ఈ టైటిల్ పెట్టామని.. ఆ సంప్రదాయం చుట్టూ ఎంతో హృద్యమైన సన్నివేశాలు సినిమాలో చూస్తారని, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యే హార్ట్ టచింగ్ మూవీ ఇదని ఆయన అన్నారు.