ఆల్కహాల్ తాగడానికి టైమ్ సరిపోతుందా

అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ఆల్కహాల్ చాలా నెలలుగా ల్యాబ్ లో మగ్గుతోంది. సితార లాంటి పెద్ద సంస్థ నిర్మాణంలో రూపొందిందే అయినా రకరకాల కారణాల వల్ల విడుదల వాయిదా వేస్తూ వచ్చారు. ముందు చెప్పిన ప్రకారం అయితే ఈ ఏడాది జనవరి ఒకటి రిలీజ్ కావాల్సింది. కానీ చేయలేదు. తర్వాత అప్డేట్స్ ఆపేశారు. ఈ గ్యాప్ లో నరేష్ మరో మూవీ రంభ ఊర్వశి మేనక రావడం, అంచనాలు అందుకోలేక ఫెయిలవ్వడం జరిగిపోయాయి. కనకదుర్గ నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే.

ఫైనల్ గా ఆల్కహాల్ కొత్త డేట్ ఎంచుకుంది. డిసెంబర్ 18 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు ప్రకటన ఇచ్చింది. కానీ ముందు వెనుక ఉన్న రిలీజులు, బాక్సాఫీస్ పరిస్థితులు బేరీజు వేసుకున్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే క్రిస్మస్ కి ఏకంగా మూడు క్రేజీ కొత్త సినిమాలున్నాయి. బాలకృష్ణ దాదా, నాగార్జున కింగ్ 100, షారుఖ్ ఖాన్ కింగ్ వస్తున్నాయి. ఆల్కహాల్ తో పాటుగా హాలీవుడ్ నుంచి డ్యూన్ 3, అవెంజర్స్ డూమ్స్ డే భారీ అంచనాల మధ్య తెలుగు వెర్షన్ తో దాడి చేయబోతున్నాయి.

ఇవి పక్కన పెడితే ఆల్కహాల్ కు వారం ముందు ఇడుపు కాయితం, ఇంకా ఏం అనుకోలేదు, పాకెట్ రాకెట్స్ పోటీకి రెడీ అవుతున్నాయి. పేరుకి చిన్న సినిమాలే అయినా పెద్ద చేతులు వీటి వెనుక ఉన్నాయి. బన్నీ వాస్, సుకుమార్ రైటింగ్స్, వంశీ నందిపాటి, నీహారిక కొణిదెల లాంటి క్రియేటివ్ ప్రొడక్షన్లు పెద్ద ఎత్తున మార్కెటింగ్ తో రెడీ అవుతున్నాయి. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ టైసన్ నాయుడు కూడా ఇదే వారంలో వచ్చే అవకాశాలను దర్శక నిర్మాతలు పరీశీలిస్తున్నారు.

ఇంత టైట్ షెడ్యూల్ పెట్టుకుని ఆల్కహాల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విచిత్రమే. మెహర్ తేజ్ దర్శకత్వం వహించిన ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ లో అల్లరి నరేష్ మందు అలవాటు లేని హీరో పాత్ర చేస్తున్నాడు. తనకు లేకపోయినా చుట్టుపక్కల వాళ్లకు ఆఫర్ చేయడమే అతని వెరైటీ స్టైల్. లౌడ్ కామెడీ లేకుండా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో అల్లరోడు డిఫరెంట్ గా ట్రై చేశాడనే టాక్ ఉంది. మరి కంటెంట్ మీద నమ్మకంతో రిస్క్ చేస్తున్నారో లేక లేట్ అయ్యింది కాబట్టి తప్పదని చేస్తున్నారో లోగుట్టు పెరుమాళ్ళకెరుక.