ప్యారడైజ్ మీద సీనియర్ నటుడి ఆగ్రహం

థియేటర్ల నుంచి వెళ్ళిపోయి ఓటిటిలో వచ్చినప్పుడు కూడా ట్రోలింగ్ బారిన పడిన ది ప్యారడైజ్ ఇప్పుడప్పుడే సోషల్ మీడియా నుంచి సెలవు తీసుకునేలా లేదు. ఏదో ఒక రూపంలో వార్తల్లో నానుతూనే ఉంటోంది. ఏదైనా కొంచెం పాజిటివ్ గా అయితే పర్లేదు కానీ అన్ని నెగటివ్ విషయాల్లోనే బయటికి వస్తోంది. తాజాగా సీనియర్ నటుడు, కమెడియన్ బాబు మోహన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్యారడైజ్ బృందం మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆయన అన్న మాటల సారాంశం ముందు చూద్దాం.

ప్యారడైజ్ క్యాస్టింగ్ లో షూటింగ్ ప్రారంభానికి ముందు బాబు మోహన్ కూడా ఉన్నారు. ఆయన మీద లుక్ టెస్ట్ చేసి బ్రహ్మాండంగా ఉందని మెచ్చుకున్నారు. ఈ సీనియర్ నటుడి కెరీర్ లో ఇలా ఫోటో షూట్ చేయడం అదే మొదటిసారి. తర్వాత ఎలాంటి పిలుపు రాలేదు. రోజులు, నెలలు గడిచిపోయాయి కానీ అప్డేట్ లేదు. తీరా రిలీజ్ డేట్ వచ్చేసింది. కట్ చేస్తే ప్యారడైజ్ డిజాస్టర్ ఫలితం అందరికీ తెలిసిందే. బాబు మోహన్ ను ఎందుకు వద్దనుకున్నారో కనీస సమాచారం ఇవ్వకుండా వదిలేశారు.

ఇదంతా ప్రస్తావించిన బాబు మోహన్ దరిద్రం వెంటపడినందుకే ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని, ఏదైనా చెప్పి చేయాలనే సంస్కారం వాళ్లకు ఉండాలని, తాను ఉంటే ఎంత ప్లస్ అయ్యేదో అర్థం చేసుకోవాల్సిందని చెప్పుకొచ్చారు. ఈవివి తొలి చిత్రం చెవిలో పువ్వు డిజాస్టరయ్యాక ప్రేమఖైది బ్లాక్ బస్టర్ అందుకుందని, అందులో తానున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉద్దేశం ఏదైనా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పాటు యూనిట్ సభ్యుల మీద తన ఆగ్రహాన్ని బాబు మోహన్ కాస్త గట్టిగానే వ్యక్తపరిచారు.

డీ కోడింగ్ చేసుకుంటే బాబు మోహన్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉన్న పాత్రలు ఇందులో రెండు కనిపిస్తున్నాయి. ఒకటి మోహన్ బాబు తండ్రిది, రెండోది శిఖంజి మాలిక్ పక్కన అసిస్టెంట్ గా ఉన్న తనికెళ్ళ భరణీది. ఇవి కాకుండా శ్రీకాంత్ ఓదెల ఇంకేదైనా అనుకున్నారేమో తెలియదు. షూటింగ్ జాప్యం, క్యాస్టింగ్ పొరపాట్లు జరగడం ఇలా ప్యారడైజ్ ఫలితం మారడానికి కొన్ని కారణాలుగా చెప్పొచ్చు. ఎంత జరిగిపోయిన గతమే అయినా ప్యారడైజ్ చేదు జ్ఞాపకాలు ఇప్పట్లో వదిలేలా లేవు.