సిద్దు సరైన దారిలోనే వెళ్తున్నాడు

డీజే టిల్లు బ్లాక్ బస్టర్ అయ్యాక సిద్దు జొన్నలగడ్డ ఎక్కడికో వెళ్ళిపోతాడని అందరూ భావించారు. దానికి తగ్గట్టే టిల్లు స్క్వేర్ కూడా సూపర్ డూపర్ హిట్ కావడం ఆ నమ్మకాన్ని మరింత పెంచింది. అయితే తర్వాత కథలు, దర్శకుల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల సిద్దు చాలా మూల్యమే చెల్లించాడు. బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వచ్చిన జాక్ దారుణంగా పోయింది. నీరజ కోనకు అవకాశం ఇచ్చి తెలుసు కదా చేస్తే అది ఎవరికి తెలియకుండా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత గ్యాప్ వచ్చింది.

ఇటీవలే సుమంత్ మహేంద్రగిరి వారాహిలో స్పెషల్ రోల్, అంతకు ముందు మిస్టర్ బచ్చన్ లో క్యామియో ఎందుకు చేశాడో ఫ్యాన్స్ కి ఇప్పటికీ అర్థం కాదు. వీటి మధ్యలో సిద్దు జొన్నలగడ్డ ఆగిపోయిన సినిమాలు రెండున్నాయి. ఒకటి రవికాంత్ పేరెపు దర్శకత్వంలో బ్యాడ్ యాస్ కాగా మరొకటి ప్యాన్ ఇండియా బడ్జెట్ తో సితార సంస్థ ప్లాన్ చేసుకున్న కోహినూర్. ఇవి దాదాపు క్యాన్సిల్ అయినట్టే. ప్రస్తుతం సిద్ధూ ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ డైరెక్షన్లో క్రేజీ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు.

తాజగా సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ సంయుక్త నిర్మాణంలో తన పదో సినిమా మొదలుపెట్టాడు సిద్దు. మోహన్ బి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ డిఫరెంట్ లవ్ స్టోరీలో ఆయ్, రాకాస ఫేమ్ నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. థీమ్ పోస్టర్ చూస్తుంటే ఏదో వెరైటీగా ప్లాన్ చేసినట్టు ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన పూజా ఈవెంట్ కి టాలీవుడ్ పెద్దలు చాలా మందే వచ్చారు.

ఒకరకంగా చెప్పాలంటే సిద్ధూ ఇప్పుడు సరైన దారిలో వెళ్తున్నట్టు కనిపిస్తోంది. సినిమాలు వాయిదా పడినా, సబ్జెక్టులు మారిపోయినా అంతిమంగా కావాల్సింది ఫలితమే కాబట్టి దానికి అనుగుణంగా ప్రాజెక్టులు ఎంచుకోవడం మంచిదే. ఆ మధ్య నందిని రెడ్డితో ఒక సినిమా అనుకున్నాడు కానీ ఆవిడ తీసిన అన్నీ మంచి శకునములే రిజల్ట్ తర్వాత అది కూడా పెండింగ్ పడిపోయింది. మా ఇంటి బంగారం హిట్టయ్యింది కాబట్టి ఇప్పుడేమైనా తిరిగి పట్టాలు ఎక్కిస్తారేమో చూడాలి.