ప్రతి దీపావళి సందర్భంగా సోషల్ మీడియాలో ఒక చర్చ మొదలవుతుంది. పర్యావరణహిత పటాసులు కాల్చాలని సుప్రీం కోర్టు మొదలు పర్యావరణవేత్తల వరకు అందరూ హితబోధ చేస్తుంటారు. అయితే, కేవలం ఏడాదికి ఒక రోజు.. లేదా రెండ్రోజులు కాల్చే టపాసుల వల్ల పర్యావరణం విపరీతంగా పొల్యూట్ అవుతోందా అని పండుగను సెలబ్రేట్ చేసుకునే వాళ్లు కౌంటర్ చేస్తుంటారు. ఇక, బాణాసంచా వల్ల శబ్ద కాలుష్యం ఎక్కువగా వస్తుందని, మూగ జీవాలు భయపడిపోతాయని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.
అయితే, ఏడాదికి 365 రోజుల పాటు జంతువధ జరుగుతోందని…ఒక సామాజిక వర్గం వారు ఒక పండుగ సందర్భంగా జంతువధ చేస్తారని, దానిని అడ్డుకోవడం చేతకావడం లేదు కదా అని హిందువులు అంటుంటారు. కేవలం హిందూ పండుగల సందర్భంగా మాత్రమే పర్యావరణం, జంతు ప్రేమ, శబ్ద కాలుష్యం గుర్తుకు వస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే దీపావళి బాణాసంచాపై నటి రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
దీపావళి వేడుకల పేరుతో అర్ధరాత్రి దాటినా భారీ శబ్దాలతో టపాసులు కాల్చడంపై రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, దీపావళి రోజు తాను ఏమైనా మాట్లాడితే హిందూ వ్యతిరేకి అని ముద్ర వేస్తారని మౌనంగా ఉన్నానని, కానీ, పండుగ మరుసటి రోజు రాత్రి కూడా పటాసులు కాలుస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. టపాసులు కాల్చడానికి దీపావళి మరుసటి రోజు ఏ పండుగ ఉంది? అని ప్రశ్నించారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇబ్బందులను గుర్తించాలని కోరారు. మన ఆనందమే ముఖ్యమని టపాసులు పేల్చడం కేవలం మూర్ఖత్వం అని అన్నారు.
చాలామంది దీపావళితోపాటు మరుసటి రోజుకు కూడా సరిపడా టపాసులు కొని తెచ్చుకుంటారు. మరికొందరికి దీపావళి కోసం కొన్న క్రాకర్స్ కొద్దో గొప్పో మిగులుతుంటాయి. అవి రెండో రోజు కాల్చడం అనేది చాలా కామన్ ప్రాక్టీస్. మళ్లీ ఏడాది వరకు టపాసులు కాల్చే ఛాన్స్ రాదు కాబట్టి..ముఖ్యంగా పిల్లలు రెండ్రోజుల పాటు టపాసులు కాల్చి సంతోషపడుతుంటారు. కొంచెం పెద్దవారైన తర్వాత చాలామంది పిల్లలు టపాసులు కాల్చడం మానేస్తున్నారు.
కాబట్టి తల్లిదండ్రులు కూడా తన బాల్యంలో తమకు దక్కిన ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ ను తమ పిల్లలకు కూడా అందించేందుకు ప్రయత్నిస్తుంటారు. దానిని తప్పుబట్టలేం. అలా అని రేణూ దేశాయ్ చెప్పినట్లు శబ్ద కాలుష్యం, పర్యావరణ కాలుష్యం లేదు అని కాదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
