ఇటీవలే విడుదలైన ‘సమ్మర్ హాలిడేస్’ టాక్ అయితే డీసెంట్ గానే ఉంది. బాలేదని ఎవరూ అనలేదు. అలాని ఎక్స్ ట్రాడినరి అన్నారని కాదు కానీ మంచి ప్రయత్నమనే ప్రశంసలు రివ్యూల్లోనూ కనిపించాయి. హెచ్చుతగ్గులు అన్ని సినిమాల్లో ఉన్నట్టే ఇందులోనూ కనిపించాయి. అయితే ఆశించిన స్థాయిలో ఓపెనింగ్ రాలేదన్నది నిజం. అందుకే టీమ్ పట్టువదలకుండా ప్రమోషన్లు కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ మీట్ లో కీలక పాత్ర పోషించిన బాలనటుడు రోహన్ కొన్ని కామెంట్స్ చేశాడు
తమిళ మలయాళం సినిమాల మోజులో పడి మనం తెలుగు సినిమాలను సెలెబ్రేట్ చేసుకోవడం లేదని, ఇన్స్ టాలో చూసిన సామెత లాగా గోల్డ్ వేటలో పడి డైమండ్స్ పోగొట్టుకుంటున్నామని ఉటంకించాడు. అంటే బంగారం మత్తులో వజ్రాలను వదిలేస్తున్నామని దాని భావం. ఈ మధ్య డొరొతీ, బత్తా, మోదరాతిరి లాంటి తమిళ సినిమాలకు మన సోషల్ మీడియా సపోర్ట్ బాగా దక్కింది. వాటిని చూడమని కొందరు యూట్యూబర్లు ప్రత్యేకంగా వీడియోలు కూడా చేసి ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు.
వీళ్ళ ప్రస్తావన నిర్మాత ధీరజ్ మొగిలినేని నేరుగా స్టేజి మీద వీడియోలు చూపించి మరీ చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ రోహన్ అన్నట్టు తెలుగు ప్రేక్షకులు గోల్డ్, డైమండ్స్ కి తేడా తెలియనంత అమాయకులు అయితే కాదు. అందరికీ అన్నీ బాగా తెలుసు. బాహుబలి హిట్ చేసిన జనాలే బలగం, లిటిల్ హార్ట్స్ లాంటి చిన్న సినిమాలను సూపర్ డూపర్ హిట్ చేశారు. వందల కోట్లు పెట్టారని ప్యారడైజ్ ని క్షమించలేదు, రామ్ చరణ్ కష్టపడ్డాడని పెద్దిని ఇండస్ట్రీ హిట్ చేయలేదు.
తమిళ మలయాళ సినిమాలు ఓటిటిలో చూసేసి ఆహా ఓహో అంటున్న మాట వాస్తవమే. అదే డోరతి తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్ రిలీజ్ చేస్తే కనీస వసూళ్లు రాలేదు. బత్తాని కనీసం అనువదించే సాహసం కూడా చేయలేదు. వాటి నిర్మాతలు ప్రాక్టికల్ గా ఆలోచించారు కాబట్టి. ఎదురుగా రామాయణ, సీన్ లాంటి పెద్ద సినిమాలు ఉండటం వల్ల సమ్మర్ హాలిడేస్ మీద ప్రభావం పడి ఉండొచ్చు. అంత మాత్రాన టాలీవుడ్ ప్రేక్షకులకు పొరుగింటి పుల్లకూర మాత్రమే రుచి అనేస్తే ఎలా.
Gulte Telugu Telugu Political and Movie News Updates