రణబాలితో డీసెంట్ సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ జనార్థన చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ మొదలు పెట్టినప్పుడు ప్లాన్ చేసుకున్న ప్రకారమైతే ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కావాలి. కానీ రణబాలి ఆలస్యంతో పాటు ఇతరత్రా కారణాలు షూటింగ్ కి బ్రేకులు వేస్తూ వచ్చాయి. ఇప్పుడు రౌడీ హీరో పూర్తి ఫోకస్ దీని మీదే ఉండబోతోంది. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ మూవీకి నిర్మాత దిల్ రాజు పెద్ద బడ్జెట్ కేటాయిస్తున్నారు.
అయితే ఇంత స్కేల్ మీద రూపొందుతున్న ఈ సినిమాని రెండు భాగాలుగా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో టీమ్ తర్జనభర్జన పడుతోందట. కమర్షియల్ గా సత్తా చాటే సబ్జెక్టు కావడంతో పుష్ప, కెజిఎఫ్ లాగా ఖచ్చితంగా ఆదరణ దక్కించుకుంటుందనే నమ్మకం రవికిరణ్ లో కనిపిస్తోందట. ఇప్పటికింకా నిర్ణయం తీసుకోలేదు కానీ త్వరలోనే ఫైనల్ కాల్ వెలువడవచ్చు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న రౌడీ జనార్ధన ఎనభై దశకం నాటి రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందనుంది.
చాలా కాలంగా డిజాస్టర్లతో సతమతమైన విజయ్ దేవరకొండకు రణబాలి కొంత మేరకు రిలీఫ్ ఇచ్చింది. ఓవర్సీస్ లో వర్కౌట్ కాకపోయినా తెలుగు రాష్ట్రాల్లో సగానికి పైగా బ్రేక్ ఈవెన్ దాటేయడం మంచి పరిణామమే. ఒకవేళ యునానిమస్ టాక్ వచ్చి ఉంటే జైలర్ 2 కి టఫ్ కాంపిటీషన్ అయ్యేది కానీ జానర్ పరిమితులు, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేకపోవడం అడ్డంకిగా మారాయి.
రౌడీ జనార్ధన తర్వాత హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ కి ఓకే చెప్పిన విజయ్ దేవరకొండ ఈ రెండు సినిమాలు యాక్షన్, రివెంజ్ బ్యాక్ డ్రాప్ లోనే చేస్తున్నట్టు వినికిడి. మాస్ మార్కెట్ ని టార్గెట్ చేసుకుని దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకుంటున్న కెరీర్ మెల్లగా గాడిలో పడేలా ఉంది. రొమాన్స్, లవ్ స్టోరీస్ కి కొంత కాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. రణబాలి తర్వాత దేవరకొండ ఫ్యామిలీ నుంచి వస్తున్న మూవీ రష్మిక మందన్న మైసా. దీనికి కూడా పబ్లిసిటీ ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates