రేపు విడుదల కాబోతున్న కల్ట్ మెల్లగా టైటిల్ కు తగ్గట్టే సౌండ్ పెంచే పనిలో పడింది. ఇంతకు ముందు ట్రైలర్ ద్వారా హింస ఏ స్థాయిలో ఉంటుందో శాంపిల్ చూపించిన హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్ ఇవాళ మరో కొత్త కంటెంట్ వదిలి ముఖ్యంగా యూత్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాడు. గుండె ధైర్యం తక్కువ ఉన్నవాళ్లు, చిన్నపిల్లలు దూరంగా ఉండమని ముందే చెప్పడం చూస్తే ఏ రేంజ్ లో వయొలెన్స్ పండిందో అర్థం చేసుకోవచ్చు. వైల్డ్ వైల్డ్ అంటూ పదే విశ్వక్ నొక్కి చెప్పడం గమనార్హం.
ఇప్పటిదాకా వదిలిన మెటీరియల్ కల్ట్ కథ మీద ఒక అవగాహన వచ్చేలా చేసింది. స్క్విడ్ గేమ్ తరహాలో ఒక క్లబ్ హౌస్ కు వెళ్లిన యువతీయువకులకు ప్రాణాలు పణంగా పెట్టే ఆటలు ఆడాల్సివస్తుంది. తప్పించుకుందామన్నా ఛాన్స్ ఉండదు. వాళ్ళ మధ్యలో ఉన్న పోలీస్ ఆఫీసరే విశ్వక్ సేన్. రక్తాన్ని కళ్లజూస్తూ కిరాతకంగా హత్యలు చేసే ముఠాకి వాళ్ళ బాషలోనే సమాధానం చెబుతాడు. అయితే దీనికి ముందు వెనుక వేర్వేరు లేయర్స్ లో బ్యాక్ స్టోరీ ఉంటుందని ఇన్ సైడ్ టాక్.
ఇలాంటి కాన్సెప్ట్స్ వర్కౌటవుతాయా అంటే, స్క్రీన్ ప్లే కనక ఎంగేజింగ్ గా ఉంటే ఎస్ అని చెప్పొచ్చు. గతంలో మలయాళం మూవీ మార్కో వచ్చినప్పుడు దాంట్లో హింస గురించి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. కొందరు తీవ్రంగా విమర్శించారు. అయినా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. భారీ వసూళ్లు అందుకుంది. ఇప్పుడదే తరహాలో కల్ట్ కూడా కథనంతో మెప్పిస్తే మటుకు టాలీవుడ్ ఆడియన్స్ ఆదరించడం ఖాయం. గోవా నేటివిటీ కాబట్టి యువత త్వరగా కనెక్టవుతారు.
ఆదర్శ కుటుంబం ఏకె 47తో పోటీ ఎందుకులెమ్మని మిగిలినవి తప్పుకుంటే కల్ట్ మాత్రం కాంపిటీషన్ కి రెడీ అయిపోయింది. వచ్చే వారం రామాయణ పార్ట్ 1 ఉంది కాబట్టి ఆలోగా తన సత్తా చాటుకునేందుకు విశ్వక్ సై అంటున్నాడు. హిట్ కొడితే ఇతర బాషల నుంచి డబ్బింగ్, రీమేక్ హక్కుల కోసం డిమాండ్ ఏర్పడుతోంది. ఓటిటిల్లో ఇలాంటి సినిమాలకు ఎంత ఆదరణ ఉంటుందో చెప్పనక్కర్లేదు. డైరెక్టర్, యాక్టర్ గా తనలో కొత్త షేడ్ చూస్తారని చెబుతున్న విశ్వక్ సేన్ ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates