కమెడియన్ వంద కోట్ల ఇల్లు

తెలుగు సినిమా చరిత్రలో లెజెండరీ స్టేటస్ ఉన్న కమెడియన్లు పదుల సంఖ్యలో ఉన్నారు. కానీ తమిళంలో హాస్య నటుల సంఖ్య తక్కువే. ఆ తక్కువమందిలో వడివేలు స్థానం ప్రత్యేకం. ఆయనకు ముందు, తర్వాత చాలామంది కమెడియన్లు వచ్చారు కానీ.. వడివేలు స్థాయిలో సుదీర్ఘ కాలం నవ్వించిన వాళ్లు కనిపించరు. ముఖ్యంగా 80వ దశకం చివరి నుంచి ఒక రెండు దశాబ్దాల పాటు వడివేలు మామూలుగా నవ్వించలేదు.

ఇప్పుడాయన సినిమాలు బాగా తగ్గించేశారు. కామెడీ వేషాలు ఆపేసి అప్పుడప్పుడూ సీరియస్ క్యారెక్టర్లే చేస్తున్నారు. ప్రైమ్ టైంలో ఆయన కాల్ షీట్స్ చాలా కాస్ట్లీగా ఉండేవి. ఏడాదిలో బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే స్టార్ హీరోలతో సమానంగా, అంతకుమించి ఆదాయం పొందేవారు. ఆయన ఏ స్థాయిలో సంపాదించారు అనడానికి మధురైలో ఇటీవలే కట్టుకున్న ఇల్లే నిదర్శనం.

మధురై లాంటి సిటీలో కొన్ని ఎకరాల విస్తీర్ణంలో వడివేలు భారీ ఇల్లు కట్టుకున్నారు. దాని విలువ రూ.100 కోట్లు అన్నది ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన కుటుంబంలో 200 మంది దాకా ఉంటారని.. తామంతా తరచుగా కలవడానికి, పండుగలు జరుపుకోవడానికి, భోజనాలు చేయడానికే ఈ భారీ ఇల్లు కట్టుకున్నట్లు వడివేలు తెలిపారు. ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ వడివేలును కలిసి చేసిన హౌస్ టూర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది.

ఈ ఇంటి ఆవరణలో భారీ సోలార్ ప్యానెల్ సెటప్ ఏర్పాటు చేశారు. ఇంటికి కరెంటు అంతా దాన్నుంచే వస్తోంది. సెక్యూరిటీ పకడ్బందీగా ఉండేలా ఏకంగా 42 సీసీటీవీ కెమెరాలు పెట్టినట్లు వడివేలు వెల్లడించారు. ఇంటి చుట్టూ అనేక పండ్ల చెట్లు నాటించారు. పాతకాలం తరహాలో కూర్చోవడానికి అరుగులు, ఇంటి లోపలే చిన్న వినాయకుడి గుడి.. ఇలా వడివేలు భవంతి లోపల చాలా విశేషాలే ఉన్నాయి. ప్రస్తుతం వడివేలు.. ధనుష్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్నారు.