ఆదర్శం మీద అందరి కళ్ళు

సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ తర్వాత సోలో హీరోగా వెంకటేష్ నటించిన సినిమా ఆదర్శ కుటుంబం ఏకె 47. మధ్యలో మన శంకరవరప్రసాద్ గారు ఉంది కానీ అది ప్రధానంగా చిరంజీవి ఖాతాలోకి వెళ్తుంది కాబట్టి ఫ్యాన్స్ కోణంలో చూసుకుంటే కౌంట్ కాదు. నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి లాంటి సూపర్ హిట్స్ కి మాటలు రాసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మూడు దశాబ్దాల తర్వాత వెంకీని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అందుకే అభిమానులు ప్రత్యేకంగా ఫీలవుతున్నారు.

మాములుగా ఇంత క్రేజీ కాంబోలో ఒక మూవీ వస్తున్నప్పుడు సోషల్ మీడియా, గ్రౌండ్ లెవెల్ లో ఓ రేంజ్ హైప్ ఉండాలి. కానీ ఆదర్శ కుటుంబానికి అంత భారీగా కనిపించడం లేదనేది వాస్తవం. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే స్థాయిలో ప్రమోషనల్ కంటెంట్ డిజైన్ చేయడంలో టీమ్ తడబడింది. ఎందుకంటే తొమ్మిది పాటలున్న తమన్ ఆల్బమ్ లో బయటికి వదిలింది కేవలం రెండు సాంగ్స్. మిగిలినవి కనీసం మూడు నాలుగు రోజుల ముందు వదలాల్సింది కానీ అదీ జరగలేదు.

సరే బజ్ సంగతి కాసేపు పక్కనపెడితే ఆదర్శ కుటుంబం ఏకె 47 టాక్ కనక డీసెంట్ వస్తే దీపావళి పండగ అయిపోయేవరకు ఎలాంటి లోటు ఉండదు. వసూళ్లు బ్రహ్మాండంగా వస్తాయి. మార్కెటింగ్ వీక్ గా జరిగితే ఇదెలా సాధ్యమనే డౌట్ రావొచ్చు. జైలర్ 2 కి సైతం సన్ పిక్చర్స్ పెద్దగా ప్రచారం చేయకుండానే థియేటర్లకు తీసుకొచ్చింది. కట్ చేస్తే అదేమో ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. గతంలో ఎబోవ్ యావరేజ్ టాక్స్ వచ్చిన లెనిన్, మా ఇంటి బంగారం ఏకంగా వంద కోట్ల క్లబ్బులో అడుగు పెట్టాయి.

కాబట్టి ఇక్కడ ఎవరిని ఏ సినిమాని తక్కువంచనా వేయడానికి లేదు. వెంకటేష్ ధీమా చూస్తుంటే మరో ష్యుర్ షాట్ హిట్టనే నమ్మకం కనిపిస్తోంది. త్రివిక్రమ్ తన నుంచి రెగ్యులర్ గా ఆశించేది కాకుండా ఊహించని సర్ప్రైజులు తెరమీద చూడమని ఊరిస్తున్నారు. కేవలం రెండున్నర నెలల గ్యాప్ లో వెంకటేష్ ఇంకో మూవీ జనవరి 12 విడుదల వస్తోంది. ఇప్పుడీ ఆదర్శ కుటుంబం కనక విజయం సాధిస్తే ఆల్రెడీ క్రేజ్ సంపాదించుకున్న రావిపూడి మూవీకి మరింత డిమాండ్ పెరగడం ఖాయం.