సోషల్ మీడియా ఉంది కదాని బురద జల్లే వ్యవహారాలు ఈ మధ్య బాగా ఎక్కువైపోయాయి. ఎంతగా అంటే ఒకరిని లేదా ఒక సినిమాని టార్గెట్ చేసుకుంటే చాలు దాని కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు వెనుకాడని పరిస్థితి తలెత్తుతోంది. దురదృష్టవశాత్తు జాన్వీ కపూర్ లాంటి హీరోయిన్లు ఈ ట్రాప్ లో పడిపోయి తమను తాము సమర్ధించుకోవడానికి ఏవేవో స్టేట్ మెంట్లు ఇస్తూ అందరూ మర్చిపోయిన టాపిక్ తిరిగి తెరమీదకు తీసుకొస్తున్నారు. ఇప్పుడీ టాపిక్ కి కారణం కాఫీ విత్ కరణ్ టాక్ షో.
ఇందులో పాల్గొన్న జాన్వీ కపూర్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా స్ట్రీమింగ్ కు వచ్చింది. అందులో భాగంగా కరణ్ జోహార్ పెద్ది గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు, ఎంత బాధ పడి ఉంటారో కదాని విపరీతంగా జాలి చూపిస్తూ అడిగారు. దానికి జాన్వీ వీలైనంత హుందాగా స్పందిస్తూ పెద్ది కోసం చాలా మంది కష్టపడ్డారని అందుకునే మౌనంగా ఉన్నానని, తీస్తున్నప్పుడే గొడవ చేసి ఉండాల్సిందని, సౌత్ సినిమాల స్క్రిప్ట్స్ లో కెమెరా యాంగిల్స్ రాసుకోరని వ్యంగ్యంగా సెటైర్ కూడా వేసింది.
ఇక్కడ చాలా మంది కన్వీనియంట్ గా మర్చిపోతున్న విషయం ఏమిటంటే పెద్ది కన్నా ముందు, ఆ తర్వాత కొన్ని వందల సినిమాల్లో హీరోయిన్ ఓవర్ ఎక్స్ పోజర్, రాంగ్ క్యారెక్టరైజేషన్ జరిగింది. ఎక్కడిదాకో ఎందుకు టాక్సిక్ లో కియారా అద్వానీ, తారా సుతారియా క్యారెక్టరైజేషన్లను ఎవరూ ప్రశ్నించలేదు. రుక్మిణి వసంత్ ముందు యష్ బట్టలు లేకుండా నిలబడిన సన్నివేశాన్ని ఎవరూ అడగలేదు. దాన్ని కల్ట్ ఫిలిం మేకింగ్ అని సమర్ధించుకునే మేధావులకు సోషల్ మీడియాలో లోటు లేదు.
ఇది పెద్దినో లేదా బుచ్చిబాబునో సమర్ధించే ప్రయత్నం కాదు. వేలెత్తి చూపడం తప్పులు జరిగిన ప్రతి సినిమా విషయంలో జరగాలి తప్పించి కేవలం పెద్దికి మాత్రమే కాదు. ఇదే జాన్వీ కపూర్ నటించిన సన్నీ సంస్కారికి తులసి కుమారిలో అద్దం ముందు నిలబడి తోటి హీరోయిన్ తో కొలతల గురించి మాట్లాడుకునే సీన్ చూస్తే పెద్దినే కాస్త నయమనిపిస్తుంది. అయినా ఎప్పుడో నెలల క్రితం జరిగిపోయిన దాన్ని కరణ్ అదే పనిగా తవ్వడం చూస్తే ఓటిటి వ్యూస్ రావడం కోసం వివాదం రేపడం తప్ప మరో రీజన్ లేదు. అతను కోరుకున్నది జరిగింది. సోషల్ మీడియాలో ఈ వీడియోలే వైరలవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates