కోటి పారితోష‌కం గురించి మౌళిని అడిగితే…

గ‌త ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమాతో సంచ‌ల‌నం రేపాడు యువ న‌టుడు మౌళి. సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్‌గా ప్ర‌యాణం మొద‌లుపెట్టిన ఒక మామూలు కుర్రాడు.. ఇలా హీరో అయి తొలి సినిమాకే రూ.40 కోట్ల క్ల‌బ్బులో అడుగు పెట్ట‌డం మామూలు విష‌యం కాదు. ఆ త‌ర్వాతి సినిమా విష‌యంలో తొంద‌ర‌ప‌డ‌కుండా.. కొంచెం ఓపిక ప‌ట్టి, మైత్రి మూవీ మేక‌ర్స్ లాంటి పెద్ద బేన‌ర్లో దొంగ నా కొడుకు సినిమా చేశాడు మౌళి. న‌వంబ‌రు 13న విడుద‌ల కానున్న ఈ చిత్రంపై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

ఈ సినిమాకు ప్రొడ‌క్ష‌న్ అంతా కూడా మౌళినే ద‌గ్గ‌రుండి చూసుకున్న‌ట్లు మైత్రి అధినేత ర‌విశంక‌ర్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇంత చేసిన మౌళికి కోటి రూపాయ‌ల పారితోషకం ఇచ్చిన‌ట్లు కొన్ని నెల‌ల ముందే వార్త బ‌య‌టికి వ‌చ్చింది. దీంతో మౌళి అప్పుడే కోటి రూపాయ‌ల రేంజికి వెళ్లిపోయాడా అని అంతా మాట్లాడుకున్నారు. మ‌రి ఈ వార్త ఎంత వ‌ర‌కు నిజం అని మౌళి నుంచి తెలుసుకుందామంటే అత‌ను నోరు విప్ప‌లేదు.

దొంగ నా కొడుకు టీం లేటెస్ట్ ప్రెస్ మీట్లో మౌళిని ఈ కోటి పారితోష‌కం గురించి అడిగితే.. తాను ఆర్థిక ప‌ర‌మైన విష‌యాల గురించి మాట్లాడ‌కూడ‌ద‌ని నిర్ణ‌యంచుకున్న‌ట్లు చెప్పాడు. దాని గురించి మాట్లాడితే ఫోక‌స్ వేరేగా వెళ్లిపోతుంద‌ని, కాబ‌ట్టి త‌న రెమ్యూన‌రేష‌న్ ఎంతో వెల్ల‌డించ‌న‌ని అత‌ను స్ప‌ష్టం చేశాడు. అలా అని త‌న రేంజ్ ఇంత అని ఎవ‌రూ ఫిక్స‌యిపోవాల్సిన ప‌ని లేద‌ని.. మంచి క‌థ ఉంది, ఇంత రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌లేం, అస‌లు డ‌బ్బులే ఇవ్వలేం అన్నా కూడా.. స్క్రిప్టు న‌చ్చితే సినిమా చేయ‌డానికి రెడీ అని మౌళి చెప్ప‌డం విశేషం.

ఇక లిటిల్ హార్ట్స్‌తో పోలిస్తే దొంగ నా కొడుకు సినిమాకు బ‌డ్జెట్ కొంచెం ఎక్కువే అయిన‌ట్లు చెప్పిన మౌళి.. ముందు అనుకున్న మొత్తంలోనే సినిమాను పూర్తి చేసిన‌ట్లు వెల్ల‌డించాడు. కాలేజీ టైంలో చిన్న చిన్న వీడియోలు చేసుకునే తాను.. ఈ రోజు హీరోగా న‌టిస్తూ, ప్రొడ‌క్ష‌న్ కూడా చూసుకునే స్థాయికి వ‌చ్చానంటే కంఫ‌ర్ట్ జోన్ నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌టికి రావ‌డం వ‌ల్లే అని ఈ సందర్భంగా మౌళి వ్యాఖ్యానించాడు.