తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం అని చాలా ఏళ్ల కిందట్నుంచే చెబుతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన ఆ సినిమా తీస్తే చూడాలని దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి మొదలవడానికి ముందు మాట్లాడుతూ.. తనకు మహాభారతం తీయడానికి పదేళ్ల అనుభవం కావాలని చెప్పాడు జక్కన్న. ఆ పదేళ్లు పూర్తయిపోయాయి.
బాహుబలి, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఈ మెగా ప్రాజెక్టును డీల్ చేయగల అనుభవాన్ని సాధించాడు. ఆయన మార్కెట్ కూడా తిరుగులేని స్థాయికి చేరుకుంది. కానీ ఇంకా మహాభారతం దిశగా అడుగులేమీ పడలేదు. వారణాసి తర్వాత అయినా ఆ సినిమాను మొదలుపెడతాడో లేదో స్పష్టత లేదు. అభిమానులు మాత్రం అదే కోరుకుంటున్నారు.
ఐతే వేల కోట్ల బడ్జెట్ పెట్టి ఈ ఎపిక్ మూవీని నిర్మించే ప్రొడ్యూసర్ ఎవరన్నది ప్రశ్న. రామాయణం ప్రాజెక్టు మీద రూ.4 వేల కోట్లు పెట్టిన నమిత్ మల్హోత్రా.. రాజమౌళి మహాభారతాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్న వాళ్లూ లేకపోలేదు. రామాయణం లాస్ ఏంజెల్స్ ప్రిమియర్ సందర్భంగా ఒక ఏపీ వ్యక్తి.. నమిత్‌తో ఇదే ప్రస్తావన తెచ్చాడు. తాను తెలుగువాడినని చెబుతూ నమిత్‌ను పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి.. రాజమౌళితో మహాభారతం తీయొచ్చు కదా అని అడిగాడు. అందుకాయన ముందు గట్టిగా నవ్వాడు.
తర్వాత రాజమౌళి లెజెండరీ డైరెక్టర్ అని, ఆయనకు అన్నీ విజయాలే చేకూరాలని ఆకాంక్షించారు. కానీ మహాభారతం తీసే విషయమై స్పష్టత ఇవ్వలేదు. ఐతే పెద్ద బిజినెస్ మ్యాన్, వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయిన నమిత్ మహాభారతంలో భాగమైతే.. రాజమౌళి బడ్జెట్ గురించి ఆలోచించకుండా, ప్రశాంతంగా క్రియేటివ్ వర్క్ చూసుకోవచ్చు. ఐతే నమిత్ ఈ ప్రయత్నం చేయాలంటే ముందు రామాయణం మంచి ఫలితాన్నందుకోవాలి. రామాయణం పార్ట్-1 దీపావళి కానుకగా నవంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates