రావణుడికి సీతమ్మ సర్టిఫికెట్ ఇవ్వడమేంటి

ఇంకొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 లో సీతగా నటించిన సాయిపల్లవి మీద చాలా కళ్లున్నాయి. తను ఎలా పెర్ఫార్మ్ చేసి ఉంటుంది, ఎక్కడైనా దొరికే ఛాన్స్ ఉందా, విమర్శలు గుప్పిద్దామా అంటూ ఎదురు చూస్తున్న సోషల్ మీడియా బ్యాచ్ పెద్దదే ఉంది. అయితే రిలీజ్ కన్నా ముందే తనే వివాదం తెచ్చుకునేలా ఉంది. లాస్ ఏంజిల్స్ లో జరిగిన స్పెషల్ ప్రీమియర్ కు హాజరైన సాయిపల్లవి ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధితో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

రావణుడు పూర్తి చెడ్డవాడు కాదని, మనలోనూ ఒక రావణుడు ఉంటాడని, సందర్భానికి తగ్గట్టు బయటికి రావడం, మారిపోవడం జరుగుతూ ఉంటుందని చెప్పింది. ఈ పాత్రని యష్ పోషించాడు కాబట్టి ఏదో పొగడాలని ఇలా అని ఉండొచ్చు కానీ అర్థం మాత్రం ఇంకోలా వెళ్ళిపోతుంది. పరస్త్రీని సాధువు వేషంలో మోసం చేసి ఎత్తుకొచ్చి, అశోక వనంలో దాచిన రావణుడు ఏ కోశానా చెడ్డవాడు కాదని చెప్పడం కష్టం. రాముడొచ్చి యుద్ధం చేసే వరకు ఆమెకు విడుదల దొరకలేదుగా.

వాల్మీకి నుంచి బాపు దాకా రామాయణం ఎందరో రాశారు, సినిమాలుగా తీశారు. వాటిలో రావణుడి గొప్ప లక్షణాలు కొన్ని చూపించారు. అంతమాత్రాన ఆయన సహజ గుణమైన దుర్మార్గం పక్కకు పోదు. తమ్ముడు విభీషణుడు మంచివాడిగా గుర్తింపబడ్డాడు కానీ ఈయన కాదు. అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేనిపోని రిస్క్ తీసుకొస్తాయి. ఇప్పటికే ఉత్తరాది జనాలు సాయిపల్లవిని టార్గెట్ చేసుకుని ఉన్నారు. ఏక్ దిన్ రిలీజ్ టైంలో కొంత బయట పెట్టుకున్నారు కూడా.

ఇలా కాంట్రావర్సీల్లో చిక్కుకోవడం సాయిపల్లవికి కొత్త కాదు. గతంలో విరాట పర్వం సమయంలో కాశ్మీరీ పండిట్ల గురించి అన్న మాటలు వేర్వేరు అర్థంలో బయటికి వెళ్లి రాద్ధాంతం చేశాయి. నాలుగేళ్ళ క్రితం భారత సైన్యం గురించి చెప్పడం అపార్థానికి దారి తీసింది. కావాలని ఏదీ చేయకపోయినా సోషల్ మీడియా ప్రపంచంలో సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటి సమస్యలే ఎదురు కోవాల్సి వస్తుంది. రిలీజ్ కింకా ఎనిమిది రోజుల సమయముంది కాబట్టి ఆలోగా ఏమైనా వివరణ వస్తుందేమో చూద్దాం.