ఎల్లుండి ఆదర్శ కుటుంబం, కల్ట్ తో పోటీ పడుతున్న చిన్న సినిమా కిల్లర్. పూర్వజ్ అనే దంపతులు పరిమిత బడ్జెట్ లో తీసిన హై ఎండ్ యాక్షన్ సినిమా ఇది. గ్రాఫిక్స్ వాడారు. హాలీవుడ్ మూవీ వేనోమ్ తరహాలో వెరైటీ ఎక్స్ పరిమెంట్లు చేశారు. ఇది థ్రిల్లర్ జానర్ లో తీసింది కాబట్టి సహజంగానే ట్విస్టులుంటాయి. అయితే కీలకమైన ఒక మలుపుని ఇంటర్వెల్ తర్వాత అయిదు నిమిషాల లోపు ఎవరైతే ఊహించి వాట్సప్ లో పంపిస్తారో వాళ్లలో ఒకరికి కోటి రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించడం ఎక్స్ లో హాట్ టాపికయ్యింది.
రేపు రాత్రి జరిగే ప్రీమియర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎందుకంటే ఒక షో అయ్యాక ఎలాగూ ట్విస్టు తెలిసిపోతుంది కాబట్టి తర్వాత ఈ స్కీం కొనసాగించలేరు. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఆడియన్స్ కి ఆఫర్ ఇవ్వడం చాలా అరుదు. నిజంగా ఇది వర్కౌట్ అవుతుందో లేదో చెప్పలేం కానీ పబ్లిసిటీ పరంగా అయితే ఉపయోగపడుతోంది. అందులోనూ ఎదురుగా రెండు ఇమేజ్ ఉన్న స్టార్ హీరోల సినిమాలు కాంపిటీషన్ లో ఉన్నప్పుడు ఇలాంటి గిమ్మిక్కులు చేయక తప్పదు.
వినడానికి బాగానే ఉంది కానీ రేపు అర్ధరాత్రి మొదటి షో అయ్యాక యునానిమస్ టాక్ వస్తేనే ఇలాంటి కిల్లర్లు బజ్ తో పాటు ఓపెనింగ్స్ తెచ్చుకోగలుగుతాయి. లేదంటే వెంకీ విశ్వక్ మధ్య నలిగిపోవాల్సి ఉంటుంది. పూర్వజ్ కపుల్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ట్రైలర్ చూస్తే మాస్ ని టార్గెట్ చేసిన గ్లామర్ కంటెంట్ కూడా కనిపిస్తోంది. కథను బాగానే రివీల్ చేశారు కానీ అసలేమాత్రం ఊహకందని ట్విస్టు ఉంటుందని, అందుకే కోటి రూపాయల ఆఫరని చెబుతున్నారు.
కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు చిన్న సినిమాల మనుగడ కోసం ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీలు తప్పడం లేదు. ఆ మధ్య తెల్లకాగితం రిలీజ్ కు ముందు మా మూవీ పైరసీ అయిపోయిందంటూ తెగ హడావిడి చేశారు. తీరా చూస్తే ఒక క్లిప్పు మాత్రమే బయటికి వచ్చింది. అది ఎంతో కొంత ఫోకస్ వచ్చేలా చేసిన మాట వాస్తవం. కిల్లర్ లో ఇమేజ్ లేని క్యాస్టింగ్ ఉంది కాబట్టి ఈ కోటి రూపాయల స్కీం ని ఆయుధంగా వాడుతున్నారు. మరి ఏ మేరకు పనికొస్తుందో రేపు రాత్రి తేలనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates