రామ్‌చరణ్ చేజారిందే రన్బీర్ అందుకున్నాడా

వచ్చే నెల నవంబర్ 5 విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అంచనాలున్నాయో తెలిసిందే. నిర్మాత నమిత్ మల్హోత్రా చెప్పినట్టు నాలుగు వేల కోట్ల బడ్జెట్ తో తీశారంటే అంత గొప్పగా రాముడి కథని ఎలా చెప్పి ఉంటారనే ఆసక్తి కేవలం సినిమా ప్రియుల్లోనే కాదు సగటు సనాతనవాదుల్లో కూడా బోలెడుంది. అయితే ఈ ప్రాజెక్టు ఏదో నిన్నా మొన్న ఆషామాషీగా అనుకున్నది కాదు. ఇంకా చెప్పాలంటే గతంలో టాలీవుడ్ హీరోతో ప్లాన్ చేసుకున్నదంటే ఆశ్చర్యం కలగకమానదు.

తొమ్మిది సంవత్సరాల క్రితం 2017 టైంలో నిర్మాతలు నమిత్ మల్హోత్రా, అల్లు అరవింద్, మధు మంతెన కలిసి రామాయణంని తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నారు. అధికారికంగా మొదలుపెట్టలేదు కానీ దానికి సంబందించిన పనులైతే అప్పట్లో జరిగాయి. 500 కోట్లకు పైనే బడ్జెట్ వేసుకున్నారు. రామ్ చరణ్ ని రాముడిగా ఫిక్స్ చేసి, మిగిలిన క్యాస్టింగ్ కూడా స్టార్ హీరో హీరోయిన్లతో సెట్ చేయాలని అనుకున్నారు. తర్వాత హఠాత్తుగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదన దగ్గర ఆగిపోయింది.

అప్పుడు రంగంలోకి దిగిన దర్శకుడు కూడా నితేశ్ తివారినే. కొంత కాలం గడిచాక నమిత్ మల్హోత్రా దీన్ని సింగల్ గా టేకప్ చేయాలని నిర్ణయించుకుని రావణుడిగా నటించిన యష్ ని నిర్మాణ భాగస్వామిగా తీసుకుని పట్టాలు ఎక్కించారు. రాముడిగా రన్బీర్ కపూర్ వచ్చి చేరగా సీత కోసం పెద్ద కసరత్తు చేసి, ఆడిషన్లు నిర్వహించి చివరికి సాయిపల్లవిని తీసుకున్నారు. ఆ తర్వాత సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ మొదలైనవాళ్లు వచ్చి చేరారు. మూడేళ్లు నిర్మాణం జరిగింది.

అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ ని నిర్మాణ సంస్థ ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఇప్పుడిది టీమ్ కు అవసరం లేదు కాబట్టి విడుదల తర్వాత ఏమైనా పంచుకుంటారేమో చెప్పలేం కానీ, గీత ఆర్ట్స్ రామాయణంకు సంబంధించిన పాత వార్తలు గూగుల్, ట్విట్టర్ సెర్చ్ చేస్తే సులభంగా కనిపిస్తాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత కాబట్టి రామ్ చరణ్ కనక నిజంగా రామాయణంలో రాముడిగా చేసి ఉంటే ముఖ్యంగా నార్త్ ఇండియాలో మరింత బజ్ వచ్చేదేమో. అయినా రాసిపెట్టనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు.