నవంబర్ నెలలో ఇంత రష్ ఏంటయ్యా

మాములుగా బాక్సాఫీస్ లెక్కల్లో నవంబర్ నెలని డ్రైగా భావిస్తారు. కారణం భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీపావళి పండగ ఉన్నప్పటికీ సెలవు ఒక్క రోజు మాత్రమే వస్తుంది కాబట్టి హాలిడే అడ్వాంటేజ్ ఉండదు. అందులోనూ ఈసారి దివాలి ఆదివారం వచ్చి ఇంకో ట్విస్టు ఇచ్చింది. అయితే 12, 13 తేదీల్లో ఏకంగా డజను కొత్త రిలీజులు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో ఒకవైపు సంతోషం కలిగిస్తూనే ఇంకో వైపు ఆందోళన రేపుతోంది. ముందు ఏమేం ఉన్నాయో చూద్దాం.

మొదటిసారి శర్వానంద్ ఊరమాస్ పాత్ర చేసిన ‘భోగి’ మీద క్రమంగా హైప్ వస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ రూరల్ డ్రామాలో యాక్షన్ ఎపిసోడ్స్ షాక్ కి గురి చేస్తాయని అంటున్నారు. లిటిల్ హార్ట్స్ తో మార్కెట్ సంపాదించుకున్న మౌళి హీరోగా రూపొందిన ‘దొంగ నా కొడుకు’ మీద యూత్ లో మంచి అంచనాలే ఉన్నాయి. పెద్ద చేతులు అండగా నిలబడి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వచ్చిన ‘ఇట్లు అర్జున’ ఎట్టకేలకు మోక్షం దక్కించుకోనుంది.

35 చిన్న కథ కాదు ఫేమ్ విశ్వదేవ్ నటించిన ‘డార్క్ చాకొలేట్’ చాలా గ్యాప్ తర్వాత థియేటర్ మోక్షం దక్కించుకుంటోంది. దగ్గుబాటి రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. యాంకర్ సుధీర్ ‘గోట్’ ని తక్కువంచనా వేయడానికి లేదు. ఇవి కాకుండా టాల్కమ్ పౌడర్, చంద్రయాన్, రోమియో జూలియట్, మాయా లేడీ ఇలా మరికొన్ని చిన్న మీడియం బడ్జెట్ సినిమాలు ఒకేసారి ముప్పేట దాడి చేయబోతున్నాయి. వీటితో పాటు నాగార్జున గీతాంజలి రీ రిలీజ్ కూడా ఉంది.

ఇలా అతివృష్టి లాగా ఇన్నేసి సినిమాలు రావడం ఎంతమేరకు సేఫ్ గేమ్ అవుతుందనేది టాక్ ని బట్టి ఉంటుంది. కొన్ని సెంటర్లలో స్క్రీన్ల లభ్యత తక్కువ కారణంగా పైన చెప్పినవాటిలో కొన్ని రిలీజ్ కూడా కావు. పైగా ఆదర్శ కుటుంబం మూడో వారం, రామాయణ పార్ట్ 1 రెండో వారంలో రన్ అవుతూ ఉంటాయి కాబట్టి థియేటర్ల లభ్యత అంత ఈజీగా ఉండదు. మరి ఇన్నేసి గంపగుత్తగా రావడం బాగానే ఉంది కానీ వీటిలో ఏవి నిలబడతాయో ఏవి మాయమవుతాయో వేచి చూడాలి.