ధనుష్ సినిమా చిచ్చు పెడుతుందా?

తమిళ అగ్ర కథానాయకుల్లో ఒకడైన ధనుష్.. ప్రయోగాల నుంచి కొంచెం పక్కకు వచ్చి ఈసారి పక్కా కమర్షియల్ సినిమానే చేస్తున్నట్లున్నాడు. ‘అమరన్’ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి రూపొందిస్తున్న ఆ చిత్రమే.. ఓం. ఈ చిత్రం నుంచి ఇప్పటిదాకా రిలీజైన ప్రోమోలన్నీ ఆకట్టుకున్నాయి. లేటెస్ట్‌గా నాయుడపేట నిత్యారెడ్డిగా సాయిపల్లవి పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ప్రోమో కూడా మెప్పించింది.

ఐతే ఈ గ్లింప్స్‌తో పాటు ఇంతకుముందు రిలీజ్ చేసిన ప్రోమోలను గమనిస్తే.. ఇది ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ నడిచే కథ అని అర్థమైపోతుంది. ఇందులో ధనుష్ ఎర్రచందనం కూలీలకు నాయకత్వం వహించే కుర్రాడి పాత్రలో కనిపించనున్నాడు. ఇదంతా చూశాక ‘పుష్ప’ సినిమా గుర్తుకు రావడం ఖాయం. ఐతే ఆల్రెడీ ‘పుష్ప’ ఉండగా మళ్లీ అలాంటి కథనే చెప్పే ప్రయత్నం చేస్తారని అనుకోలేం. రాజ్ కుమార్ కొంచెం డిఫరెంట్‌గా, తన స్టయిల్లో ఎర్రచందనం కూలీల కథను చెప్పబోతున్నాడనిపిస్తోంది.

ఏపీలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దుంగలు కొట్టే పని చేసేది చాలా వరకు తమిళ కూలీలే. అదంతా పెద్ద నెట్‌వర్క్. ఎర్రచందనం చెట్లను కొట్టడం పెద్ద నేరం కావడంతో స్థానికులు ఆ పని చేయడం తక్కువ. ఐడెంటిటీ లేని తమిళ కూలీలే ఎక్కువ డబ్బులకు ఆశపడి వచ్చి దుంగలు కొడుతుంటారు. పోలీసుల మీద కూడా వాళ్లు చాలాసార్లు ఎటాక్ చేసిన చరిత్ర ఉంది. ఐతే ఒక సందర్భంలో మాత్రం చిత్తూరు జిల్లా పోలీసులు పాశవిక దాడి చేసి ఒకేసారి 20 మంది తమిళ కూలీలను చంపేశారు. 2015లో అదొక సంచలనంగా మారింది. ఏపీ పోలీసుల తీరును తమిళులు తీవ్రంగా ఖండించారు. స్మగ్లర్లను వదిలేసి అమాయకులైన కూలీలను చంపేశారంటూ నిరసనలు కూడా జరిగాయి.

ఇప్పుడు ధనుష్, రాజ్ కుమార్ కలిసి ఈ ఉదంతం నేపథ్యంలోనే ‘ఓం’ సినిమా తీస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమిళ కూలీల కోణంలోనే ఈ సినిమా నడుస్తుందని.. ఇందులో ఏపీ పోలీసులను విలన్లుగా చూపించబోతున్నారని.. సినిమా రిలీజయ్యాక ఏపీ వైపు నుంచి అభ్యంతరాలు ఎదురు కావడం ఖాయమని అంటున్నారు. మరి ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి స్పందన వస్తుందో.. తమిళ సినిమాలను ఎగబడి చూసే మన ప్రేక్షకులను మన వాళ్లను విలన్లుగా చూపిస్తే ఎలా తీసుకుంటారో చూడాలి.