తండేల్ తర్వాత ఏడాది గడిచినా నాగచైతన్య నుంచి కొత్త సినిమా రాలేదు. అభిమానులు ఎదురు చూసి చూసి నెలలు అయిపోయాయి కానీ తెరదర్శనం జరగలేదు. వృషకర్మ లాంటి ప్యాన్ ఇండియా మూవీ కోసం విపరీతంగా కష్టపడ్డ చైతు దానికి తగ్గ ఫలితం కోసం డిసెంబర్ 4 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కేవలం సెట్ వేయడానికే యాభై రోజుల టైం తీసుకున్నారంటే స్కేల్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు ఈ స్క్రిప్ట్ మీద మూడేళ్లకు పైగా కష్టపడ్డారు.
తాజాగా వృషకర్మకు సంబంధించిన కథ సినాప్సిస్ ఒకటి ఆన్ లైన్లో చక్కర్లు కొట్టేస్తోంది. దాని ప్రకారం ఇది మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. అంతులేని సంపద కోసం ఆశపడే ఒక నిధుల వేటగాడు, తపనతో రగిలిపోయే ఒక పురావస్తు శాస్త్రవేత్త, చరిత్రపై విపరీతమైన శ్రద్ధ కలిగిన ఒక హిస్టరీ స్టూడెంట్, ఈ ముగ్గురు కలిసి సమయానికి ఎదురీదుతూ రాజవంశ జ్యోస్యం కారణంగా ప్రపంచానికి ఎదురు కాబోయే ముప్పులో భాగమవుతారు. అదేంటనేది తెరమీద చూడాలి.
ఇది నిజమో కాదో కానీ ఒకవేళ అయితే మటుకు కార్తీక్ దండు ఈసారి అంచనాలకు మించి ఏదో ఇవ్వబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ విజువల్ ఫాంటసీ డ్రామాలో విఎఫ్ఎక్స్ కు చాలా ప్రాధాన్యం ఉంది. ఇంత ఆలస్యం కావడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. బెస్ట్ క్వాలిటీ కోసం టీమ్ ఎంతో కష్టపడింది. తెలుగులోనే కాకుండా హిందీ తమిళ లాంటి ఇతర బాషల ఆడియన్స్ ని మెప్పించే యునివర్సల్ అప్పీల్ ఇందులో ఉందట.
ఫౌజీ తప్పుకోవడం వృషకర్మకు చాలా ప్లస్ అయ్యింది. డిసెంబర్ మొదటివారం టెన్షన్ పడేంత పెద్ద పోటీ అయితే లేదు. రెండు మూడు మీడియం బడ్జెట్ సినిమాలున్నాయి కానీ స్కేల్ పరంగా అవి చైతు మూవీకి సమానంగా అయితే నిలవవు. 2026 తమ్ముడు అఖిల్ ఆల్రెడీ లెనిన్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు చైతన్య కనక వృషకర్మతో సక్సెస్ కొడితే అదే నెలాఖరులో నాన్న నాగార్జున కింగ్ 100 రూపంలో ఏడాదిని ఘనంగా ముగించి అభిమానులకు కానుక ఇవ్వొచ్చు. అప్పుడది ట్రిపుల్ బొనాంజ అవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates