వారసుడి బాధ్యత తీసుకున్న హిట్ జోడీ?

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మంచి అంచనాల మధ్య కొన్ని నెలల ముందు హీరోగా అరంగేట్రం చేశాడు ఘట్టమనేని జయకృష్ణ. కృష్ణ మనవడు, రమేష్ బాబు తనయుడైన జయకృష్ణ.. ‘శ్రీనివాస మంగాపురం’లో నటుడిగా మెప్పించినా, ఆ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు ఏమాత్రం మెప్పించని కథా కథనాలతో జయకృష్ణ డెబ్యూను చేదు అనుభవంగా మార్చాడు.

ఈ సినిమా గురించి ముందే తెలిసే ఏమో మహేష్ బాబు కూడా ‘శ్రీనివాస మంగాపురం’ను పెద్దగా ప్రమోట్ చేయలేదు. ఐతే ఇప్పుడు జయకృష్ణ రెండో సినిమా విషయంలో ఇటు మహేష్, అటు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు కొంచెం జాగ్రత్తగానే ప్లానింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఈసారి హిట్ పెయిర్‌గా పేరున్న సాయిరాజేష్, ఎస్కేఎన్‌లకు జయకృష్ణను అప్పగించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

మొదట్లో హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి స్పూఫ్ సినిమాలు తీసిన సాయి రాజేష్.. తర్వాత కలర్ ఫొటో, బేబీ, చెన్నై లవ్ స్టోరీ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ఇందులో ‘బేబీ’కి ఆయనే దర్శకుడు. మిగతా రెండు చిత్రాలకు కథ అందించడంతో పాటు ప్రొడక్షన్ కూడా చూసుకున్నాడు. బేబీ, చెన్నై లవ్ స్టోరీ సినిమాలకు ఎస్కేఎన్ ప్రధాన నిర్మాతగా ఉన్నాడు. ‘చెన్నై లవ్ స్టోరీ’తో వీళ్లిద్దరి బ్రాండ్ ఇంకా బలపడింది.

ఈ నేపథ్యంలోనే జయకృష్ణకు హిట్ ఇచ్చే బాధ్యతను ఈ ఇద్దరికీ అప్పగించారట. ఈ సినిమా కూడా సాయిరాజేష్ స్క్రిప్టుతోనే తెరకెక్కనుంది. ఎస్కేఎన్‌తో కలిసి ఆయనే సినిమాను నిర్మిస్తాడు. ఐతే డైరెక్షన్ కూడా చేస్తాడా.. ఆ బాధ్యతలు ఇంకెవరికైనా అప్పగిస్తారా అన్నది చూడాలి.

ఆటోమేటిగ్గా ఇది కూడా ప్రేమకథే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. జయకృష్ణను మాస్ హీరోగా ఎలివేట్ చేయడం కంటే నటుడిగా పేరుతో పాటు సక్సెస్ సాధించేలా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.