నాలుగు దశాబ్దాలకు పైగా నటప్రస్థానంలో దర్శకులు ఆర్ నారాయణమూర్తి ఏనాడూ తన బాటను వీడింది లేదు. సమాజానికి సందేశాన్ని ఇచ్చే సినిమాలు తీస్తూ డబ్బులు వచ్చినా రాకపోయినా, వాటి మీదే మళ్ళీ మళ్ళీ పెట్టుబడులుపెట్టి, ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో నిలబడటం మాములు విషయం కాదు. అందులోనూ విప్లవ పంథాని ఎంచుకోవడం, దానికే కట్టుబడి ఉండటం అతి కొద్దిమందికే సాధ్యమయ్యింది. అయితే పీపుల్స్ స్టార్ ఇప్పటిదాకా కమర్షియల్ చిత్రాల్లో నటించిన దాఖలాలు లేవు.
ఎర్రోడు, ఒరేయ్ రిక్షా లాంటివి ఇతర దర్శకులతో చేసినవే అయినా అవి కూడా ఎర్రజెండా సిద్ధాంతాలను ఆధారంగా రూపొందించి తీసినవే. చాలా సార్లు ఎందరో స్టార్ డైరెక్టర్లు ఆర్ నారాయణమూర్తికి పాత్రలు ఆఫర్ చేశారు. పూరి జగన్నాథ్ ఏకంగా ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి టెంపర్ లో పోసాని పోషించిన హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్ కోసం అడిగారు. అయినా లాభం లేకపోయింది. కామ్రేడ్ కళ్యాణ్ కోసం కూడా అడిగారనే టాక్ వచ్చింది కానీ కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రమే గెస్టుగా వచ్చారు.
కట్ చేస్తే హుషారు 2లో ఆర్ నారాయణమూర్తి ఒక స్పెషల్ క్యామియో చేశారు. ఇది నిజంగా ఆశ్చర్యం కాదు షాక్ కలిగించే విషయం. ఎందుకంటే ఇది యూత్ ఫుల్ మూవీ. కథ ప్రకారం పీపుల్స్ స్టార్ కు అడవిలో నక్సలైట్ పాత్ర ఇచ్చినప్పటికీ మెయిన్ సబ్జెక్టు పూర్తిగా ఎంటర్ టైన్మెంట్ మీదే నడుస్తుంది. మరి దర్శకుడు శ్రీహర్ష ఏం చెప్పి ఒప్పించారనేది సస్పెన్స్ గా మారింది. అయినా ఇది మంచి పనే. ఇకపై మరింత దర్శకులు ఆయన కోసం పవర్ ఫుల్ పాత్రలు రాసుకుంటారు.
చాలా కాలంగా ఆర్ నారాయణమూర్తి గారు సినిమాలు చేయడం లేదు. అప్పుడప్పుడు ఒకటి రెండు చేస్తున్నారు కానీ అవేవి బాక్సాఫీస్ వద్ద నిలబడ్డం లేదు. విద్యార్థుల సమస్యల మీద తీసిన యునివర్సిటి రెండుసార్లు విడుదల చేసినా లాభం లేకపోయింది. హుషారు 2కి కనక పీపుల్స్ స్టార్ ప్లస్ అయితే రెగ్యులర్ ఆడియన్స్ తో పాటు ఆయనకంటూ ఉన్న ప్రత్యేక అభిమానులు కూడా మూవీ చూస్తారు. ఇలాగే మెల్లగా స్టార్ హీరోలతో కూడా కాంబోలు సెట్ చేస్తే అరుదైన కలయికలు సాధ్యమవుతాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates