బాలీవుడ్లో తొలి అడుగులు వేస్తున్న సమయంలో తెలుగులో ప్రభాస్ లాంటి పెద్ద హీరో సరసన ‘ఏక్ నిరంజన్’ సినిమా చేసింది కంగనా రనౌత్. ఐతే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కంగనాకు కూడా ఆ సినిమా పెద్దగా పేరు తీసుకురాలేదు. ఐతే తర్వాత కంగనా బాలీవుడ్లో పెద్ద రేంజికి వెళ్లిపోయింది. నటిగా గొప్ప పేరు సంపాదించి.. హీరోయిన్లలో సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించింది. ఐతే మళ్లీ ఎప్పుడూ ఆమె తెలుగులో నటించింది లేదు.
ఐతే ఎట్టకేలకు, 17 ఏళ్ల విరామం తర్వాత కంగనా తెలుగు సినిమాల వైపు చూస్తున్నట్లు సమాచారం. ఆమె ప్రధాన పాత్రలో సీనియర్ ఫిలిం మేకర్ రవిబాబు ఓ సినిమా చేయబోతున్నాడట. తనకు బాగా కలిసొచ్చిన హార్రర్ థ్రిల్లర్ జానర్లో రవిబాబు ఈ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఎప్పట్లాగే రవిబాబు, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశముంది.
రవిబాబు కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనదగ్గ సినిమా.. అవును. ఆ సినిమాతో హార్రర్ జానర్లో కొత్త ట్రెండ్ నెలకొల్పాడు రవిబాబు. కానీ దానికి కొనసాగింపుగా తీసిన ‘అవును-2’ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తర్వాత రవిబాబు తీసిన ఏ సినిమా కూడా ఆడలేదు. ఈ ఏడాది ‘రేజర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవిబాబు. అది ప్రేక్షకుల దృష్టిలో పడకుండానే వెళ్లిపోయింది.
ఈ సినిమా, దీనికి ముందు చిత్రాలు చూస్తే రవిబాబు పనైపోయిందనే ఫీలింగ్ వచ్చేసింది ప్రేక్షకులకు. ఇలాంటి టైంలో కంగనా లాంటి బాలీవుడ్ స్టార్‌తో తెలుగు సినిమా చేయడానికి రెడీ అవడం చిత్రమే. కంగనా ఉంది కాబట్టి ఈ చిత్రం హిందీలో కూడా రిలీజ్ కావచ్చు. ఐతే కంగనాకు కూడా కొన్నేళ్లుగా అస్సలు కలిసి రావడం లేదు. ఒకప్పుడు వంద కోట్ల సినిమాలు అందించిన కంగనా.. ఈ మధ్య అందులో పదో వంతు వసూళ్లను కూడా రాబట్టలేకపోతోంది. మరి ఫెయిల్యూర్లలో ఉన్న రవిబాబు, కంగనా కలిసి ఎలాంటి సినిమాను అందిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates