నాగ‌వంశీ ఫ్రెండు కాదు, ప్రొడ్యూసర్ మాత్రమే

ఒక హీరో, ఒక‌ నిర్మాత క‌లిసి సినిమా చేసే క్ర‌మంలో కొన్ని నెల‌లు, సంవ‌త్స‌రాలు క‌లిసి ప్ర‌యాణం చేస్తారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం కుద‌ర‌డం మామూలే. ఫంకీ సినిమా కోసం క‌లిసి ప‌ని చేసిన నాగ‌వంశీ, విశ్వ‌క్సేన్‌ల మ‌ధ్య కూడా మంచి స్నేహ‌మే ఉంటుందని అనుకునేలాగే ఆ సినిమా రిలీజ్ టైంలో ప్ర‌వ‌ర్తించారు ఆ ఇద్ద‌రూ. కానీ సినిమా స‌రిగా ఆడ‌క‌పోవ‌డం వ‌ల్లో, మ‌రో కార‌ణంతోనో ఇద్ద‌రి మ‌ధ్య అంత స‌న్నిహిత సంబంధాలు లేన‌ట్లే క‌నిపిస్తోంది.

త‌న కొత్త సినిమా క‌ల్ట్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో నాగ‌వంశీ ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌పుడు విశ్వ‌క్ స్పందించిన తీరే ఇందుకు రుజువు. నాగ‌వంశీ ప్రొడ్యూస్ చేసిన ఆద‌ర్శ కుటుంబం ఈ నెల 30న రిలీజ్ కానుండ‌గా.. అదే రోజు క‌ల్ట్‌ను పోటీకి దింపుతున్నాడు విశ్వ‌క్. మ‌రి మీకు క్లోజ్ ఫ్రెండ్ అయిన నాగ‌వంశీతో పోటీకి వెళ్తున్నారేంటి అని అడిగితే.. నాగ‌వంశీ నాకు క్లోజ్ ఫ్రెండేం కాదు, ఆయ‌న నిర్మాత నేను హీరో అంత వ‌ర‌కే అంటూ ఆశ్చ‌ర్య‌ప‌రిచే జ‌వాబిచ్చాడు విశ్వ‌క్.

ఇక ఆద‌ర్శ కుటుంబంతో పోటీ గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా కూడా బాగా ఆడాల‌ని అత‌ను ఆకాంక్షించాడు. ఆద‌ర్శ కుటుంబం పూర్తిగా ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ అని, త‌న‌ది యూత్ మెచ్చే యాక్ష‌న్ మూవీ అని.. రెండూ వేర్వేరు జాన‌ర్ల‌లో తెర‌కెక్కిన సినిమాలు కాబ‌ట్టి వేటి ప్రేక్ష‌కులు వాటికి ఉంటార‌ని విశ్వ‌క్ అన్నారు. ఒక ఫ్యామిలీ ఇంటి నుంచి ఒక‌టిగా బ‌య‌ల్దేరి.. వేర్వేరు స్క్రీన్ల‌కు వెళ్లిపోవ‌చ్చ‌ని విశ్వ‌క్ చ‌మ‌త్క‌రించాడు.

మ‌రోవైపు క‌ల్ట్ మూవీలో వ‌యొలెన్స్ ఎక్కువ ఉండ‌డం గురించి వస్తున్న అభ్యంత‌రాల మీదా విశ్వ‌క్ స్పందించాడు. ఇందులో హింస జుగుప్సాక‌రంగా ఉండ‌ద‌ని, యూత్ ఎంజాయ్ చేస్తార‌ని అత‌న‌న్నాడు. వ‌యొలెన్స్ అన‌గానే ప్రేక్ష‌కులు అస‌హ్యించుకుంటార‌నేదేమీ లేద‌ని, అలా అయితే డీసీ సినిమాను ఎలా చూశార‌ని.. వయొలెన్స్‌ను చూపించే ప‌ద్ధ‌తి మీద ఏదైనా ఆధార‌ప‌డి ఉంటుంద‌ని విశ్వ‌క్ అభిప్రాయప‌డ్డాడు.