తమిళనాట విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టిన మూడేళ్ల లోపే ముఖ్యమంత్రి అయిపోవడం పెద్ద సంచలనమే. ఆ రాష్ట్రంలో ఇన్నేళ్లుగా ఆధిపత్యం చలాయిస్తున్న ద్రవిడ పార్టీలకు పెద్దగా భవిష్యత్ ఉండదన్న అంచనాల నేపథ్యంలో మిగతా సినీ స్టార్లకు కూడా రాజకీయాల మీద ఆశలు పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. యువ కథానాయకులు ధనుష్, శివకార్తీకేయన్ రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్న సంకేతాలు ఇచ్చారు.
ఈ ఇద్దరిలో ధనుష్ చాలా సీరియస్‌గానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్య అభిమాన సంఘాలతో ఓ భారీ సమావేశం నిర్వహించి సేవా కార్యక్రమాల దిశగా వారిని ఉత్సాహపరిచాడు. అధికారికంగా ఏం మాట్లాడాడన్నది పక్కన పెడితే.. అనధికారికంగా అయితే అభిమాన సంఘాలకు రాజకీయ పార్టీ దిశగా సన్నద్ధపరిచే ప్రయత్నమే చేశాడన్నది తమిళనాడు మీడియా వర్గాల మాట. ఆ తర్వాత ధనుష్ ఫోకస్ సినిమాల వైపు మళ్లింది.
ఐతే ఇప్పుడు సైలెంటుగా తెర వెనుక రాజకీయాల కోసం సన్నాహాలను కొనసాగిస్తున్నట్లే కనిపిస్తోంది. తాజాగా అతను తమిళనాడులోని 50కి పైగా జిల్లాల నుంచి 2500 మంది మహిళా అభిమానులను చెన్నైకి రప్పించి వారితో సమావేశం అయ్యాడు. వీరి ద్వారా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి, మహిళలను ఆకర్షించే కార్యక్రమాలు చేయాలన్నది ధనుష్ ఆలోచనగా తెలుస్తోంది. మహిళల ఆకాంక్షలు తెలుసుకుని వారిని ఆకట్టుకునే పథకాల రూపకల్పన కూడా చేస్తున్నట్లు కనిపిస్తోంది.
2031 ఎన్నికలకు విజయ్ మరింత బలపడతాడని, అతడికి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు పోటీనిచ్చే స్థాయిలో ఉండవని.. సొంత పార్టీ పెట్టి ఆ సమయానికి విజయ్‌కి పోటీదారుగా మారాలన్నది ధనుష్ ఆలోచన అని అంటున్నారు. అందుకోసం పకడ్బందీ ప్రణాళికలతో ధనుష్ అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ధనుష్ ఓం మూవీని పూర్తి చేసి, కొత్త సినిమా సన్నాహాల్లో ఉన్నాడు. అమరన్ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించిన ఓం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates