మెగావర్స్… కొత్త అధ్యాయం ఎలా ఉంటుందో

మెగాస్టార్ చిరంజీవి మరోసారి బుల్లితెరపై మెరవబోతున్నారు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు యాంకర్ గా ఒక సీజన్ నడిపించిన సంగతి తెలిసిందే. తర్వాత కొనసాగించలేకపోయారు. నాగార్జున అప్పటికే ఈ షో మీద తనదైన ముద్ర వేయడంతో పోలికలు అడ్డంకిగా మారాయి. అటుపై చిరు అలాంటి ఆలోచనలు చేయకుండా పూర్తిగా సినిమాలకు అంకితమైపోయారు. తాజాగా మెగావర్స్ పేరుతో నెట్ ఫ్లిక్స్ కోసం ఒక టాక్ షో చేయబోతున్నారని సమాచారం. షూట్ కూడా ప్రారంభమయ్యిందట.

ఇందులో చిరంజీవి జీవితానికి సంబంధించిన ఎన్నో అరుదైన విశేషాలతో పాటు షోకు విచ్చేసే సెలబ్రిటీలతో నెవర్ బిఫోర్ తరహాలో ముచ్చట్లు ఉంటాయని తెలిసింది. అయితే బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఆల్రెడీ చేసేశారు కాబట్టి దాని తరహాలో కాకుండా కొత్త ఫార్మాట్ ని సిద్ధం చేసినట్టు వినికిడి. రెండింటికి రచన బాధ్యతలు బివిఎస్ రవికే ఇవ్వడం గమనించాల్సిన విషయం. చిరుతో సందడి చేయబోయే తొలి ఎపిసోడ్ గెస్టు ఎవరో ఇంకా ఫైనల్ కాలేదు. మిగిలినవి ఒక్కొకటిగా సెట్ అవుతున్నాయట.

బ్రహ్మానందం, సునీల్, సత్య లాంటి కమెడియన్స్ తో మొదటి ఎపిసోడ్ ఉండొచ్చని అంటున్నారు. లాంచ్ తేదీ తదితర వివరాలు ప్రకటించడానికి ఇంకా టైం ఉంది. ఇలాంటి టాక్ షో చేయాలని చిరంజీవి మనసులో ఎప్పటి నుంచో ఉంది. బయోపిక్ పేరుతో పుస్తకం రాయడానికి సంవత్సరాల సమయం తీసుకోవడం కన్నా ఇలా వీడియో రూపంలో శాశ్వతంగా ఉండిపోయే ప్రోగ్రాం చేయడం ద్వారానే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట.

చిరంజీవి స్వయంగా చేస్తున్నారు కాబట్టి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్లతో మొదలుపెట్టి నాని, మహేష్ బాబు లాంటి జూనియర్ల దాకా ప్రత్యేక అతిథులను చాలా మందిని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఒక ట్రెండ్ సెట్ అయ్యేలా డిజైన్ చేశారని యూనిట్ వర్గాల టాక్. విశ్వంభర, కాకాలో ఏది సంక్రాంతికి విడుదలవుతుందని అభిమానులు ఎదురు చూస్తున్న టైంలో ఇలా మెగావర్స్ గురించి హఠాత్తుగా ఇన్ఫో రావడం వాళ్ళను సైతం ఆశ్చర్యపరిచింది. త్వరలోనే అధికారిక ప్రకటన ఉండొచ్చు.