టికెట్ రేట్ల ఆదర్శం మేలు చేస్తుందంటారా

ప్యాన్ ఇండియా సినిమా కాదు. విజువల్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు. రిస్క్ తీసుకుని ఫారిన్ లొకేషన్లలో షూట్ చేసిన దాఖలాలు లేవు. అంతెందుకు వివిధ బాషల నుంచి కోట్ల రెమ్యునరేషన్లు ఇచ్చి పట్టుకొచ్చిన ఆర్టిస్టులు లేరు. అయినా సరే ఆదర్శ కుటుంబం ఏకె 47 కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి టికెట్ రేట్ల పెంపుకు హారికా హాసిని సంస్థ అనుమతులు తెచ్చుకుంది. మల్టీప్లెక్సులో ఒక్కో టికెట్ మీద 75, సింగిల్ స్క్రీన్ లో ఒక్కో టికెట్ మీద 50 రూపాయల హైక్ పది రోజుల పాటు తీసుకోవచ్చు.

అయితే ఇది నిజంగా కలెక్షన్ల పరంగా మేలు చేస్తుందా అంటే బొమ్మ బొరుసు లాగా దీనికి రెండు వైపులా చూడాల్సి ఉంటుంది. వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో కాబట్టి కుటుంబ ప్రేక్షకుల్లో దీని మీద మంచి బజ్ ఉంది. పెంపు ఉన్నా పర్వాలేదని వాళ్ళు ఫీలైతే టికెట్లు కొంటారు. సంక్రాంతికి వస్తున్నాం రేంజ్ లో యునానిమస్ అనిపించుకుంటే లెక్కలు వేసుకోకుండా థియేటర్లకు వస్తారు. లేదంటే పరిస్థితి కొంచెం అటుఇటు అయ్యే రిస్క్ ఉంటుంది. ఇంకో కోణం చూద్దాం.

మొన్నటిదాకా ఉన్న నెగటివిటీ ట్రైలర్ వచ్చాక తగ్గింది. దీన్ని టీమ్ సానుకూలంగా వాడుకోవాలంటే అదిరిపోయిందనే రేంజ్ లో టాక్ తెచ్చుకోవాలి. తమన్ ఇచ్చిన పాటలు ఇప్పటిదాకా వైరల్ అయిపోయి ఊపేసే స్థాయిలో జనాలు మాట్లాడుకోలేదు. ఓకే పర్వాలేదనే మాట వినిపించింది తప్ప అల వైకుంఠపురము లాగా క్రేజీ ఆల్బమ్ అనిపించే ఛాన్స్ మిస్ చేసుకుంది. ఇలా పాటల పరంగా ఏదో ఒకటి ప్లస్ అయ్యుంటే ఈపాటికి హైప్ అమాంతం పెరిగిపోయి సీన్ మారేది.

ఏదైనా ప్రెస్ మీట్ లో టికెట్ రేట్ల గురించి అడిగితేనేమో నిర్మాత నాగవంశీ బెంగళూరు వెళ్ళండి అక్కడ ధరలు ఎక్కువగా ఉన్నాయి, ఫలానా చోటు కంటే మేం తక్కువ వసూలు చేస్తున్నాం అని చెబుతారు తప్పించి జైలర్ 2 లాంటి డబ్బింగ్ మూవీకి, ఆదర్శ కుటుంబం లాంటి మీడియం బడ్జెట్ స్టార్ హీరో సినిమాకు ఎందుకు పెంపు అంటే మాత్రం లాజికల్ గా వివరించకుండా పక్క రాష్ట్రాల ఉదాహరణలు చెబుతారు. ఆదర్శ కుటుంబం టాక్ ఎలా వస్తుందనే దాని గురించి పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.