విశ్వక్ చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించాడు

ఈ వారం అక్టోబర్ 30 విడుదల కాబోయే కల్ట్ కి ఎలాంటి ముందు రోజు ప్రీమియర్లు ఉండవని విశ్వక్ సేన్ తేల్చి చెప్పేశాడు. రిలీజ్ కన్నా ముందు రాత్రి షోలు వేయడం ద్వారా ఆడియన్స్ కన్నా ఎక్కువగా సైంటిస్టులు వస్తున్నారని దీని వల్ల అసలు టాక్ బయటికి రాకపోవడమో లేదా లేనిపోని శల్యపరీక్షలతో డ్యామేజ్ కావడమో జరుగుతోందని తేల్చేశాడు. నిజం చెప్పాలంటే విశ్వక్ చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించాడు. గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్న దాన్ని లోతుగా విశ్లేషించుకుని నిర్ణయం తీసుకున్నారు.

ఎందుకంటే కంటెంట్ బాగుండటం బాలేకపోవడం పక్కనపెడితే ప్రీమియర్స్ ప్రభావం సోషల్ మీడియాలో తీవ్రంగా ఉంటోంది. కొన్నిసార్లు యావరేజ్ లు ఫ్లాప్ అయ్యే రిస్క్ తెచ్చుకుంటే, మరికొన్నిసార్లు డిజాస్టర్ల మీద ట్రోలింగ్ భరించలేని స్థాయికి చేరుకుంటోంది. దీని వల్ల జెన్యూన్ గా మొదటి రోజు వెళ్లాలనుకున్న ప్రేక్షకులు ఈ రివ్యూస్ వల్ల ఆగిపోతున్నారు. ఓపెనింగ్స్ సరిగా రాక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఇదంతా వ్యవస్థీకృత నష్టంగా మారిపోతోంది.

ఇలా ఎందుకు జరుగుతోందనే దానికి కారణాలున్నాయి. ప్రీమియర్లకు కేవలం మీడియా జనాలే రావడం లేదు. యూట్యూబ్, ఎక్స్, ఇన్స్ టా సెలబ్రిటీలతో పాటు ఏదోలా టికెట్లు సంపాదించి రివ్యూల పేరుతో పోస్ట్ మార్టం చేయడం కోసమే వచ్చే వాళ్ళ సంఖ్య ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉంటే ఇప్పుడు వందలు దాటిపోతోంది. వీళ్ళను కట్టడి చేయడానికి ప్రయత్నించడం అంటే ఎవరెస్ట్ కొండపైకి దారం తాడు విసిరి ఎక్కే సాహసం చేయడమే. నష్టమే కానీ లాభం ఉండదు.

అలా కాకుండా ఒకేసారి రిలీజ్ రోజు నాడే అందరికి షోలు వేయడం వల్ల కలిగే ప్రయోజనం చిన్నది అయితే కాదు. అడల్ట్ ఓన్లీ అంటూ ఫుల్ వయొలెంట్ కంటెంట్ తో వస్తున్న విశ్వక్ సేన్ తన సినిమాలో ప్రతిదీ మెప్పించేలా ఉంటుందని, స్లాషర్ మూవీ అయినా ప్రతిదీ కట్టిపడేసేలా స్క్రీన్ ప్లే పరిగెడుతుందని నమ్మకంగా చెబుతున్నాడు. కేవలం రెండున్నర నెలల వ్యవధిలో తనవి మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పుడు కల్ట్, నవంబర్ లో ఈ నగరానికి ఏమైంది 2, డిసెంబర్ లో లెగసి థియేటర్లకు రాబోతున్నాయి.