రెహమానే అసలు మైనస్ అవుతారా

వచ్చే నెల నవంబర్ 5 విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద బజ్ భీభత్సంగా లేదు కానీ మెల్లగా పుంజుకుంటున్న వైనం బుక్ మై షో ట్రెండ్స్ లో గమనించవచ్చు. ట్రైలర్ మీద మిశ్రమ స్పందన వచ్చినా ప్రేక్షకుల్లో నమ్మకం పూర్తిగా సడలిపోలేదు. ప్రమోషన్లలో రావణుడి క్యారెక్టర్ చేస్తున్న యష్ ఎక్కువ హైలైట్ అవుతున్నా రన్బీర్ కపూర్ దాన్నేమీ సీరియస్ గా తీసుకోవడం లేదు. ఈ విజువల్ గ్రాండియర్ కి పెద్ద స్థాయి ఓపెనింగ్ వచ్చేందుకు పబ్లిసిటీ పరంగా ఏమేం చేయాలో అంతా చేస్తున్నారు.

అయితే ఒక విషయంలో జనాల అసంతృప్తి ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. అదే ఏఆర్ రెహమాన్ సంగీతం. నిన్న విడుదలైన రంగులే రంగులు ట్యూన్, సాహిత్యం రెండూ ఆశించిన స్థాయిలో లేవని, పైగా ఆయన కంపోజ్ చేసిన పాత సాంగ్స్ మళ్ళీ రీమిక్స్ చేసినట్టు ఉన్నాయని పెదవి విరుస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇంటర్నేషనల్ కంపోజర్ జిమ్స్ హ్యామర్ తో కలిసి పని చేస్తున్న రెహమాన్ మీద మ్యూజిక్ లవర్స్ లో విపరీతమైన అంచనాలున్నాయి. అందుకే ఈ సమస్య.

ఇక్కడితో అయిపోలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మిగిలిన పాటల విషయంలో రెహమాన్ బెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆదిపురుష్ ఎంత ట్రోలింగ్ కు గురైనా అజయ్ అతుల్ పాటలకు చెడ్డ పేరు రాలేదు. రెండు సాంగ్స్ మంచి రీచ్ తెచ్చుకున్నాయి. శ్రీరామరాజ్యంలో ఇళయరాజా ఇచ్చిన పాటలు ఇప్పటికీ మధురంగా ఉంటాయి. ఇలాంటి అవుట్ ఫుట్ రామాయణ లాంటి గ్రాండియర్ కు పడాలి. కానీ ఛార్ట్ బస్టర్ అయ్యే రేంజ్ లో లేవనే ఫీలింగ్ రావడంతో మెల్లగా విమర్శలు మొదలయ్యాయి.

ఏది ఏమైనా నాలుగు వేల కోట్లతో తీసిన సినిమాకు ఉండాల్సిన హైప్ రామాయణకు పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. ఇదంతా తాత్కాలికమని, మొదటి షో అయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయి దర్శకుడు నితేశ్ తివారి గొప్పదనం తెలుసుకుంటారని టీమ్ పదే పదే చెబుతోంది. ఒకవేళ బిగ్ స్క్రీన్ మీద చూశాక రెహమాన్ మీద అభిప్రాయం పాజిటివ్ గా మారుతుందేమో చూడాలి. పెద్ది తర్వాత తెలుగులో రెహమాన్ బిజీ అవుతారనుకుంటే దాని యావరేజ్ ఫలితం కథను మళ్ళీ మొదటికే తెచ్చింది.