గీత గోవిదం వదిలేశా… రంగస్థలంలో తీసేశారు

ప్రతి హీరో, హీరోయిన్ కెరీర్లో ఏవో కారణాలతో చేయలేకపోయిన సినిమాలు ఉంటాయి. అవి బాగా ఆడితే ఛాన్స్ మిస్సయిందే అని ఫీలవుతారు. వదులుకున్న సినిమాలు పోయాయంటే హమ్మయ్య అనుకుంటారు. పేరుకు మలయాళ అమ్మాయి అయినప్పటికీ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి, మంచి పేరు సంపాదించిన అనుపమ పరమేశ్వరన్‌.. తెలుగులో రెండు గోల్డెన్ ఛాన్సులు వదులుకుంది. అవే.. గీత గోవిందం, రంగస్థలం.

ఈ రెండు చిత్రాల్లో అనుపమనే నటించాల్సింది. కానీ ఏవో కారణాలతో ఆ సినిమాల్లో ఆమె చేయలేకపోయింది. ఆ రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్టయ్యాయో తెలిసిందే. ఈ చిత్రాలకూ కథానాయికగా తనను కన్సిడర్ చేసిన విషయం వాస్తవమే అని అనుపమ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. అందులో ఒకటి తాను వదులుకుంటే.. ఇంకో సినిమా నుంచి తనను తీసేసినట్లు ఆమె వెల్లడించింది.

‘గీత గోవిందం’ సినిమాలో కథానాయిక పాత్ర కోసం టీం తననే అనుకుందని, కానీ తానే ఆ సినిమాను రిజెక్ట్ చేశానని, అది తన మిస్టేకే అని అనుపమ చెప్పింది. ఐతే ఎందుకు ఆ సినిమాను వదులుకున్నది మాత్రం వెల్లడించలేదు. ఇక ‘రంగస్థలం’ హీరోయిన్ పాత్ర గురించి చెబుతూ, సుకుమార్ ముందు తనకే ఛాన్స్ ఇచ్చారని.. ఐతే ఆడిషన్ అదీ అయ్యాక తాను ఆ పాత్రకు సూటవ్వనేమో అనిపించి తనను పక్కన పెట్టారని చెప్పింది.

మరి ఎందుకు తనను తప్పించారని అడగలేదా, మళ్లీ ఆయనతో పని చేసే అవకాశం రాలేదా అని అడిగితే.. తాను అలా అడిగే నటిని కాదని.. సుకుమార్ నిర్మాణంలో ‘18 పేజెస్’ చేశా కాబట్టి తనేంటో ఆయనకు తెలుసని, ఏదైనా పాత్రకు సూటవుతానంటే ఛాన్స్ ఇస్తారని అనుపమ వ్యాఖ్యానించింది.

ఇక శర్వానంద్ ‘మహానుభావుడు’ సినిమాకు చర్చలు జరిగాయని.. తర్వాత తనతో ‘శతమానం భవతి’ సినిమా చేశానని అనుపమ చెప్పింది. ‘నేను లోకల్’ చిత్రానికి కూడా ఒక డిస్కషన్ జరిగినట్లు ఆమె వెల్లడించింది. ఛల్ మోహన్ రంగ, నిశ్శబ్దం, వి, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలను తాను వదులుకున్నట్లు జరిగిన ప్రచారాన్ని అనుపమ ఖండించింది.