గరివిడి లక్ష్మి… ఇదేం విడ్డూరం

ఈ దసరాకి జైలర్-2, రణబాలి లాంటి భారీ చిత్రాలతో పాటుగా రెండు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. అందులో అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘క్రేజీ కళ్యాణం’ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కానీ ఆనంది ప్రధాన పాత్రలో ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి కథతో తెరకెక్కిన ‘గరివిడి లక్ష్మి’ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నందుకుంది.

ఉత్తరాంధ్రలో అయితే ఈ చిన్న సినిమా ప్రభంజనం సృష్టించిందనే చెప్పాలి. ఈ చిత్రానికి ఆ ప్రాంతంలో రెండో వీకెండ్లో కూడా హౌస్ ఫుల్స్ పడడం విశేషం. ఇప్పటికే అక్కడ ‘గరివిడి లక్ష్మి’ రూ.4 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. ఇప్పటికీ వసూళ్లు నిలకడగా ఉన్నాయి. మొన్న ఒక రోజు జైలర్-2, రణబాలిలను మించి షేర్ రాబట్టిందీ చిత్రం. ఇప్పుడు కూడా ఈ సినిమా ఆధిపత్యం కొనసాగుతోంది.

‘గరివిడి లక్ష్మి’ ఓవరాల్ కలెక్షన్లు రూ.6.5 కోట్లు కాగా.. అందులో ఉత్తరాంధ్ర వాటా మాత్రమే రూ.4 కోట్లు. నైజాం, సీడెడ్, ఆంధ్ర, ఈ మూడు ప్రాంతాలను కలిపినా.. అంతకంటే ఎక్కువే ఉత్తరాంధ్రలో ‘గరివిడి లక్ష్మి’ కలెక్షన్లు ఉండడం విశేషం. ‘రణబాలి’ లాంటి పెద్ద సినిమా ఓవరాల్ కలెక్షన్లను ఉత్తరాంధ్రలో ‘గరివిడి లక్ష్మి’ దాటేస్తుండడం విశేషం. ఇప్పుడు ఈ రెండు చిత్రాల కలెక్షన్లు దాదాపు సమానంగా ఉన్నాయి.

‘రణబాలి’ రన్ దాదాపుగా పూర్తి కాగా.. ‘గరివిడి లక్ష్మి’ ఇంకా కొన్ని రోజులు ఉత్తరాంధ్రలో మంచి వసూళ్లు రాబట్టేలా ఉంది. ఈ ప్రాంతంలో ‘జైలర్-2’ సైతం జోరు తగ్గించేయడం గమనార్హం. ‘ఆదర్శ కుటుంబం’ వచ్చే వరకు ‘గరివిడి లక్ష్మి’కి ఢోకా లేదు. గౌర్నాయుడు జమ్ము దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత టి.జి.విశ్వప్రసాద్, ఆయన తనయురాలు కృతి ప్రసాద్ నిర్మించారు. ఆనందితో పాటు రాగ్ మయూర్, నరేష్, షకలక శంకర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.