సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం ఇప్పుడు చాలా కష్టమైన వ్యవహారం అయిపోయింది. ఇంతకుముందులా పడుచు అమ్మాయిలను పెడితే.. ట్రోలింగ్ తప్పట్లేదు. అలా అని కొంచెం వయసు పెరిగిన వాళ్లను చూద్దామంటే వాళ్లలో చాలామంది ఫేడవుట్ అయిపోయి ఉంటారు. ఇలా ఆప్షన్లు తగ్గిపోవడం వల్ల కొందరు హీరోయిన్లను రిపీట్ చేస్తూ ఉంటారు. 2000 తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్‌తో అత్యధిక సినిమాలు చేసిన కథానాయిక నయనతార.
ఆమె ఇప్పటికే రజినీతో నాలుగు సినిమాలు చేశారు. తొలిసారి ‘చంద్రముఖి’లో సూపర్ స్టార్‌తో జోడీ కట్టిన నయన్.. ఆ తర్వాత కథానాయకుడులో స్పెషల్ రోల్ చేశారు. ఆపై దర్బార్, అన్నాత్తె చిత్రాల్లోనూ రజినీ సరసన నటించారు. ఇప్పుడు సూపర్ స్టార్‌తో ఐదో సినిమాకు రెడీ అయిపోయింది నయన్. రజినీ కొత్త సినిమా ‘ధర్మన్’లో నయన్ నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం ఇప్పుడు అధికారికం అయింది.
‘ధర్మన్’లో నయన్ ఉన్న విషయాన్ని నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో మరో సీనియర్ నటి సిమ్రన్ నటిస్తున్న విషయాన్ని లాంచ్ టైంలోనే వెల్లడించారు. ఆమెనే రజినీకి జోడీ అనుకున్నారు. కానీ ఇప్పుడు నయన్ కూడా వచ్చింది. మరి ఆమె రజినీకి జోడీగా నటిస్తుందా.. లేక ప్రత్యేక పాత్ర చేస్తోందా అన్నది చూడాలి. ఈ చిత్రంలో యువ కథానాయిక రాశి ఖన్నా కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పాత్ర మీద స్పష్టత లేదు.
ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ కూడా నటిస్తున్నాడు. అతను రాశికి జోడీ అంటున్నారు. తన పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయని కూడా చెబుతున్నారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఓ మై కడవులే, డ్రాగన్ చిత్రాలతో ఆకట్టుకున్న అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates