‘కేజీఎఫ్’నే కొట్టేసిన చిన్న సినిమా

ప్రేమద ఊరలి.. గత నెల రోజులుగా కన్నడ నాట ఈ చిన్న సినిమా రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు. వందల కోట్ల బడ్జెట్లో ‘టాక్సిక్’ లాంటి భారీ చిత్రం కూడా దాని ముందు చిన్నబోయింది. యశ్ మూవీని అధిగమించి ఆల్రెడీ ఈ చిత్రం 2026లో హైయెస్ట్ కన్నడ గ్రాసర్‌గా నిలిచింది. ఇప్పుడు యశ్ నటించిన ‘కేజీఎఫ్’ లాంటి మెగా హిట్‌ను కూడా ‘ప్రేమద ఊరలి’ తాజాగా బద్దలు కొట్టేసింది.

ఈ సినిమా వసూళ్లు లేటెస్ట్‌గా రూ.135 కోట్లకు చేరుకున్నాయి. ‘కేజీఎఫ్’ లైఫ్ టైం కలెక్షన్ రూ.134.2 కోట్లు. అప్పటికి అది కన్నడలో ఇండస్ట్రీ హిట్. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ‘ప్రేమద ఊరలి’.. ఏకంగా కేజీఎఫ్ కలెక్షన్లు దాటేయడం పెను సంచలనమే. మొత్తంగా కన్నడ హైయెస్ట్ గ్రాసర్లలో ‘ప్రేమద ఊరలి’ నాలుగో స్థానానికి చేరుకుంది. కాంతార: చాప్టర్-1 (రూ.259 కోట్లు), కాంతార (రూ.185 కోట్లు), కేజీఎఫ్-2 (రూ.183 కోట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఎంత పెద్ద హిట్ సినిమాలైనా రెండు మూడు వారాలకు జోరు తగ్గించేస్తున్న రోజులివి. కానీ ‘ప్రేమద ఊరలి’ మాత్రం ఐదో వారంలోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా 150 కోట్ల మైలురాయిని దాటడం లాంఛనమే. ఇంకొన్ని వారాలు జోరు కొనసాగిస్తే.. టాప్-2కు కూడా వెళ్లే అవకాశముంది. మనోజ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో భారీ కథేమీ ఉండదు. ఇందులో నటీనటులందరూ కొత్తవాళ్లు, చిన్న స్థాయి వాళ్లే.

కొడుక్కి పెళ్లయి కోడలు తమ జీవితాల్లోకి ప్రవేశించాక తండ్రీ కొడుకుల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో ఎమోషన్లు, సందేశం కన్నడ ప్రేక్షకులకు బాగా నచ్చి ఈ మూవీని నెత్తిన పెట్టుకున్నారు. ఐదో వీకెండ్లో కూడా ఈ సినిమాకు హౌస్ ఫుల్స్ పడడం విశేషం. ఈ మూవీని ‘ప్రేమనే ఊరిలో’ పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు కానీ.. మన ప్రేక్షకులకు అది అంతగా ఎక్కలేదు.