ముసుగులో గుద్దులాట వద్దు విశ్వంభరా

నెలలు తరబడి సంవత్సరాలు దాటిపోయి మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర టాపిక్ మళ్ళీ తెరపైకి వచ్చింది. విఎఫ్ఎక్స్ వల్ల విపరీతమైన జాప్యానికి గురైన ఈ ప్యాన్ ఇండియా మూవీ ఫైనల్ కాపీ త్వరలోనే సిద్ధం కానుందని ఫిలిం నగర్ టాక్. సంక్రాంతికి థియేటర్ విడుదల చేస్తేనే మంచి డీల్ ఇస్తామని ఓటిటి సంస్థ చెప్పడంతో ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిన టాక్ గతంలోనే వచ్చింది. అయితే కాకాని వెనక్కు లాగే సమస్యే లేదనే రీతిలో దర్శకుడు బాబీ కొల్లి పట్టుబట్టిన సంగతి తెలిసిందే.

ఈ సందిగ్ధం తీరాలంటే మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగాలి. రెండు యూనిట్లతో మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లోనే నిర్ణయం తీసుకునే దిశగా వెళ్తున్నట్టు తెలిసింది. అందుకే దసరా పండక్కు కూడా కాకా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదని తెలిసింది. ఇక్కడో విషయం మర్చిపోకూడదు. సంక్రాంతి కేవలం డెబ్భై అయిదు రోజుల దూరంలో ఉంది. ఒకపక్క వెంకటేష్ జనవరి 12 విడుదలకు థియేటర్ అగ్రిమెంట్లు జరిగిపోతున్నాయి. అవసరమైన స్క్రీన్లు లాక్ చేసుకుంటున్నారు.

మరి పండక్కు వచ్చేది విశ్వంభరనో కాకానో ముందు డిస్ట్రిబ్యూటర్లకు చెప్పాలి. ఎందుకంటే వీటికి కొనేవాళ్ళు, అమ్ముతున్న రేట్లు ఒకటే ఉండవు. డిమాండ్ కూడా వేరు. రెండూ చిరంజీవి సినిమాలే అయినా బజ్ పరంగా కాకా డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్లు మొదలుపెట్టి ట్రైలర్ వదిలాకే విశ్వంభర మీద నమ్మకం ఎంత మోతాదులో పెట్టుకోవాలనే క్లారిటీ వస్తుంది. కాబట్టి నింపాదిగా ఆలోచించటానికి టైం లేదు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి డెసిషన్లు తీసుకోవాలి.

ఇప్పటికే విశ్వంభర జాప్యం రెండు సంవత్సరాలు దాటేసింది. ఇకపై వదిలే ప్రమోషన్ కంటెంట్ వావ్ అనిపించుకునే స్థాయిలో ఉండాలి. బ్యాలన్స్ పాటలు వదల్లేదు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ ఫాంటసీ డ్రామాకు ఎంఎం కీరవాణి పాటలు సమకూర్చగా ఐటెం సాంగ్ భీమ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గౌర హరితో కంపోజ్ చేయించారని సమాచారం. కొరియన్ కనకరాజు హిట్ తో కోలుకున్న యువి క్రియేషన్లు మరింత పుంజుకోవాలంటే విశ్వంభర బ్లాక్ బస్టర్ కి తక్కువ కాకూడదు.