సినిమాల్లో వర్షం సీన్లకు బ్రేక్

సినిమాల్లో వర్షం నేపథ్యంలో సన్నివేశాలు.. పాటలు పెట్టడం కామన్. పాటల్లోనే కాదు.. ఫైట్లలోనూ రెయిన్ ఎఫెక్ట్ ఉంటే ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుందని ఫిలిం మేకర్స్ నమ్ముతారు. ‘వర్షం’ లాంటి సినిమాలకు వాన ఎంత పెద్ద ఎసెట్ అయిందో తెలిసిందే. ఇటీవల ‘ది ప్యారడైజ్’ సినిమాలో కూడా వర్షం సీన్లకు లెక్కే లేదు. చాలా సీన్లలో రెయిన్ పడుతున్నట్లు చూపించారు. కానీ సినిమాలో పెద్దగా విషయం లేకపోవడంతో వర్షం పెద్దగా కలిసి రాలేదు.

ఐతే టాలీవుడ్లో కొంతకాలం పాటు వర్షం నేపథ్యంలో సినిమాలు తీయడం కష్టంగా మారేలా కనిపిస్తోంది. తెలంగాణలో ఎన్‌లినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. వర్షా కాలంలో ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. మామూలుగా వేసవిలో నీటి ఎద్దడి తలెత్తుతుంది. కానీ ఇప్పుడు చలికాలం రాబోతుండగా.. అప్పుడే సమస్య మొదలైపోయింది. హైదరాబాద్‌కు నీళ్లు అందించే జలాయాశాల్లో నీటి మట్టం అడుగుకు వెళ్లిపోతోంది. ఇంకో రెండు నెలల్లో దుర్భర పరిస్థితులు తలెత్తుతాయని వార్తలు వస్తున్నాయి.

ఈ ప్రభావం సినిమాల షూటింగ్ మీద కూడా పడబోతోంది. ఇకపై వర్షం నేపథ్యంలో సన్నివేశాలు తీయడానికి వీల్లేదట. షూటింగ్‌లకు నీటి ట్యాంకర్లు ఇవ్వకుండా నిషేధం విధిస్తున్నట్లు సమాచారం. అనధికారికంగా ఎవరైనా ఇలా ట్యాంకర్లు వాడినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించినట్లు సమాచారం. రెయిన్ ఎఫెక్ట్ కావాలంటే ఇకపై గ్రాఫిక్స్ ద్వారా చేయించుకోవాల్సిందే తప్ప.. నీటిని వాడి షూట్ చేయడానికి వీల్లేదు.

‘ది ప్యారడైజ్’ సినిమా కోసం ఏకంగా 2 వేలకు పైగా నీటి ట్యాంకర్లు వాడారట. అప్పుడు హైదరాబాద్‌లో నీటి సమస్య లేదు. కానీ గత కొన్ని నెలల్లో పరిస్థితులు మారిపోయాయి. చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్‌‌తో పాటు పరిసర ప్రాంతాల్లో అతి తక్కువ వర్షం పడింది. మళ్లీ వచ్చే వర్షాకాలం వచ్చే వరకు ఉన్న నీటి వనరులతో సర్దుకోవడం అంత తేలిక కాదు. తాగునీటితో పాటు రోజు వారీ అవసరాలకు వాడే నీటికి చాలా సమస్యగా మారబోతోందని నిపుణులు అంటున్నారు.