హిట్టు ఫ్లాపు పక్కన పెడితే వందల కోట్ల బడ్జెట్ తో ఒక ప్రాజెక్టు హ్యాండిల్ చేసిన ఏ దర్శకుకిడైనా తర్వాత సినిమా రావడం మరీ కష్టమేమీ కాదు. సరైన కథ రాసుకుంటే నమ్మే నిర్మాతలు ఖచ్చితంగా దొరుకుతారు. కానీ రాజా సాబ్ తీశాక మారుతీ పరిస్థితి నిజంగా అగమ్యగోచరంగా మారింది. పది నెలలు గడుస్తున్నా ప్రభాస్ అభిమానులు ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. ఆఖరికి మొన్న డార్లింగ్ పుట్టినరోజుకి మారుతీ విషెస్ చెబితే కూడా వదల్లేదు. సోషల్ మీడియా మరీ బ్రూటల్ అయిపోయింది.
దీని సంగతలా ఉంచితే ఇద్దరు మెగా హీరోల్లో ఒకరితో సినిమా చేసేందుకు మారుతి చాలా ప్రయత్నించారనే వార్తలు ఆ మధ్య తెగ తిరిగాయి. కానీ రకరకాల కారణాల వల్ల అవి కార్యరూపం దాల్చలేదు. హ్యాపీ పొంగల్ టైటిల్ తో ఒక స్క్రిప్ట్ ఆయన దగ్గర రెడీగా ఉంది. దానికి కొంచెం ఇమేజ్ ఉన్న హీరో అయితే ప్రతిరోజు పండగే తరహాలో బాగా వర్కౌటవుతుందని విన్నవాళ్ళు అంటున్న మాట. అయితే ఇదో మరి ఇంకో కథనో క్లారిటీ రావాల్సి ఉంది. మారుతీ కొత్త ప్రాజెక్టు దాదాపు ఫిక్స్ అయినట్టే.
మారుతీ సోదరి నాలుగేళ్ల క్రితం కాలం చేశారు. ఆవిడ కొడుకుని హీరోని చేస్తారని మారుతీ ఆ టైంలోనే మాట ఇచ్చారట. ఇప్పుడు దాన్ని తీర్చుకునే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నట్టు సమాచారం. కుర్రాడికి నటన ఇతరత్రా విభాగాల్లో తగిన శిక్షణ ఇచ్చి సిద్ధం చేశారట. స్వయానా మేనల్లుడు సినిమా కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుని ఉంటారు. పైగా వ్యక్తిగతంగా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మారుతీకి ఎంతో ఉంది. సో రెండు లక్ష్యాలను చేరుకునేలా సినిమా ఉండాలి.
త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావొచ్చని తెలిసింది. జయాపజయాలను పక్కనపెడితే మారుతీ స్టామినాని మరీ తక్కువంచనా వేయలేం. తనకు నప్పని హారర్ కామెడీ తీసుకుని ఏదో ట్రై చేశారు కానీ లేదంటే ప్రాపర్ కమర్షియల్ సబ్జెక్టు రాసుకుని ఉంటే ప్రభాస్ ఫిల్మోగ్రఫీలో ఒక డీసెంట్ మూవీ అయ్యేది. భలే భలే మగాడివోయ్ తరహాలో ఫుల్ ఎంటర్ టైనర్ ఇస్తే చాలు మారుతీ కంబ్యాక్ కు మార్గం దొరికినట్టే. మరి అది మేనమామ రూపంలో ఎలా తీర్చుకుంటాడో వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates