300 మంది హీరోయిన్లు రిజెక్ట్ చేసిన పాత్ర‌?

హీరోల‌ను దృష్టిలో ఉంచుకుని క‌థ‌లు రాయ‌డం ఉంటుంది కానీ.. హీరోయిన్ల విష‌యంలో ఇలా జ‌ర‌గ‌డం అరుదు. ముందు స్క్రిప్టు పూర్తి చేశాక‌, ఆ త‌ర్వాతే హీరోయిన్ కోసం వేట మొద‌లుపెడుతుంటారు ద‌ర్శ‌కులు. ఈ క్ర‌మంలో కొన్ని పేర్ల‌ను ప‌రిశీలిస్తారు. సంప్ర‌దింపులు జ‌రుపుతారు. డేట్స్‌తో పాటు అన్నీ కుదిరిన‌పుడు హీరోయిన్‌ని ఓకే చేస్తుంటారు.

కొన్నిసార్లు ప‌దుల సంఖ్య‌లో హీరోయిన్ల‌ను ఆడిష‌న్ చేశాక ఒక‌రిని ఎంచుకోవ‌డం జ‌రుగుతుంటుంది. కానీ ఒక హీరోయిన్ పాత్ర కోసం ఏకంగా మూడు వంద‌ల మందిని ప‌రిశీలించ‌డం మాత్రం ఇప్ప‌టిదాకా మ‌న సినిమాల్లో దేనికీ జ‌రిగి ఉండ‌క‌పోవ‌చ్చు. ఈ రికార్డు త‌మ సినిమాకే సొంతం అంటున్నాడు రోమియో జూలియ‌ట్ ద‌ర్శ‌కుడు భార్గ‌వ్ మాచ‌ర్ల‌.

మెయిల్, శుభ‌మ్, దీవానా చిత్రాల ఫేమ్ హ‌ర్షిత్ రెడ్డి న‌టించిన రోమియో జూలియ‌ట్‌లో విశాఖ ధీమాన్ అనే కొత్త‌మ్మాయి క‌థానాయిక‌గా న‌టించింది. ఈ చిత్రం న‌వంబ‌రు 13న రిలీజ్ కానున్న నేప‌థ్యంలో టీం ప్రెస్ మీట్ పెట్టింది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. హీరోయిన్ పాత్ర కోసం 300 మందికి పైగా సంప్ర‌దించిన‌ట్లు వెల్ల‌డించాడు. ఇది విన‌డానికి అతిశ‌యోక్తిగా ఉండొచ్చ‌ని.. కానీ వాస్త‌వ‌మ‌ని అత‌ను చెప్పాడు. పిచ్ డెక్ ద్వారా ప్రొఫైల్ చూసిన వాళ్లు.. జూమ్ కాల్ ద్వారా మాట్లాడిన వాళ్లు.. నేరుగా ఆడిష‌న్ చేసిన వాళ్లు.. ఇలా అంద‌రినీ క‌లిపితే నంబ‌ర్ 300 దాటుతుంద‌ని అత‌ను చెప్పాడు.

వీరిలో కొంద‌రు త‌మ‌కు న‌చ్చ‌లేద‌ని, కొంద‌రికి పాత్ర న‌చ్చ‌లేద‌ని అన్నాడు. కానీ విశాఖ ధీమాన్ మాత్రం త‌న స్నేహితుల ద్వారా ఈ హీరోయిన్ జీవితంలో అనుభ‌వాల‌ను చూసి ఉండడంతో బాగా రిలేట్ అయి ఈ పాత్ర‌ను ఒప్పుకుంద‌ని భార్గవ్ చెప్పాడు. త‌న‌కు ఆపోజిట్ క్యారెక్ట‌ర్ కాబ‌ట్టే ఆమె ఈ పాత్ర చేసింద‌న్నాడు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చంద‌ని, కానీ ఇందులో అస‌భ్య‌క‌ర స‌న్నివేశాలేమీ ఉండ‌వ‌ని ద‌ర్శ‌కుడు స్ప‌ష్టం చేశాడు.