ఇంకో అయిదు రోజులో ఆదర్శ కుటుంబం ఏకే 47 విడుదల కానుంది. ముందు నుంచి కొంత నెగటివిటీ నడిచినప్పటికీ ట్రైలర్ వచ్చాక పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. వెంకటేష్ సినిమా, అందులోనూ ఆయన్ని మొదటిసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. తమన్ పాటలు ఆశించిన స్థాయిలో లేవనే కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న టైంలో మెల్లగా వాతావరణం వెంకీ బృందానికి సానుకూలంగా మారడం మంచి పరిమాణం.
ట్రేడ్, ప్రేక్షకులు ఆశిస్తుంది ఒకటే. ఆదర్శ కుటుంబం ఎబోవ్ యావరేజ్ ఉన్నా చాలు జనాలు కనెక్ట్ అయిపోయి బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తారు. ఈ మధ్య వచ్చిన జైలర్ 2, రణబాలి, 418, కామ్రేడ్ కళ్యాణ్ మొదలైన వాటికి యూనానిమస్ పాజిటివ్ టాక్ రాలేదు. పర్వాలేదు, డీసెంట్ ఉన్నాయి, ఒకసారి చూడొచ్చనే మాట బయటికి రావడంతో కలెక్షన్లు బాగా వచ్చాయి. వాటి బిజినెస్ కు తగ్గట్టు ఒకటి రెండు చోట్ల మినహాయించి దాదాపు అన్ని చోట్ల రికవరీ పూర్తి చేశాయి.
అలాంటిది వెంకటేష్ లాంటి హీరోకు ఇదే టాక్ వస్తే థియేటర్లు కళకళలాడతాయి. నెలాఖరులో రావడం కొంచెం ఇబ్బందే అయినా వెంటనే జీతాలు తీసుకునే వారం వస్తుంది కాబట్టి వసూళ్ల పరంగా టెన్షన్ పడాల్సింది ఏమీ లేదని బయ్యర్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పైగా దీపావళి పండగ దగ్గర్లో ఉంది కనక పాజిటివ్ అనిపించుకుంటే ఎంత లేదన్నా ఆదర్శ కుటుంబానికి రెండు వారాల సాలిడ్ థియేటర్ రన్ దక్కుతుంది. వేగంగా బ్రేక్ ఈవెన్ దాటేయొచ్చు.
ఇంకో రెండున్నర నెలల్లో తన ఇంకో సినిమా జనవరి 12 విడుదలతో వస్తున్న వెంకటేష్, రెండూ బ్లాక్ బస్టర్ అవుతాయనే ధీమాతో ఉన్నారు. ఫ్యాన్స్ కోరుకుంటున్నది కూడా అదే. చాలా తక్కువ గ్యాప్ లో రెండు మూవీస్ ఇవ్వడం వాళ్లకు సంతోషం కలిగించే విషయమే అయినా ఆ తర్వాత తమ హీరో ఎంత పెద్ద బ్రేక్ తీసుకుంటాడోననే అనుమానం రావడం సహజం. అందుకే ఇవి పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. ఆదర్శ కుటుంబంతో విశ్వక్ సేన్ కల్ట్ పోటీ పడేందుకు రెడీ అయ్యింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates