బిల్డప్ ఇచ్చిన సినిమాకు టాక్ ఏంటి

ఫ్యామిలీ మ్యాన్ పుణ్యమాని ఓటిటి ప్రపంచంలో చాలా డిమాండ్ ఉన్న ఆర్టిస్టుల్లో ఒకరిగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ కొత్త సినిమా ‘గజబ్ రాత్’ ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో నేరుగా విడుదలయ్యింది. తెలుగుతో పాటు ప్రధాన భాషల్లో డబ్బింగ్ చేశారు. కొన్ని నెలల క్రితం దీనికి పెట్టిన టైటిల్ ఘుస్కొర్ పండత్. ఈ పేరు ఒక సామజిక వర్గాన్ని అవమాన పరిచేలా ఉందంటూ కొన్ని సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తర్జన భర్జన పడి టైటిల్ మార్చి కొంచెం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఇంతకీ కథేంటో చూద్దాం. అజయ్ నిర్విత్ (మనోజ్ బాజ్ పాయ్) ఒక లంచగొండి పోలీస్ ఆఫీసర్. అమ్మాయిల పిచ్చి కూడా ఉంటుంది. ఒక రాత్రి దారుణమైన గాయాలతో కారులో నుంచి విసిరేయబడ్డ ఒక యువతి కేసుని విచారించే బాధ్యత ఇతని మీద పడుతుంది. లోతుగా వెళ్లేకొద్దీ ఈ ఘటన వెనుక చాలా పెద్ద వ్యాపార, రాజకీయ శక్తులు ఉన్నాయని సాక్ష్యాలతో సహా అర్థమవుతుంది. ముందీ కేసు నుంచి డబ్బు సంపాదించాలనుకున్న అజయ్ మనసు మార్చుకుని అసలు దోషుల వరకు వెళ్తాడు.

వినగానే జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ గుర్తుకు వస్తుంది కదూ. నిజమే లైన్ పరంగా పోలికలు స్పష్టంగా ఉన్నాయి కానీ దర్శకులు నీరజ్ పాండే, రితేష్ షా ట్రీట్ మెంట్ పరంగా చేసిన మార్పులు, బ్యాక్ డ్రాప్ పూర్తిగా వేరే ఉన్నాయి. ఒక హాస్పిటల్, రెండు మూడు అవుట్ డోర్ లొకేషన్లలో రెండు గంటల కంటెంట్ ని నడిపించడం ఇందులో ప్రధాన విశేషం. బడ్జెట్ పరంగా ఎక్కువ బరువు లేకుండా ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలోనే స్టోరీ నడిపించారు. చాల పరిమితులు పెట్టుకున్నారు.

ఇంత బిల్డప్ ఇచ్చిన ఈ మూవీ ఫైనల్ గా చెప్పాలంటే ఏమంత చెప్పుకోదగ్గ స్థాయిలో అయితే లేదు. మలుపులు మాములుగా సాగడం, అసలు ట్విస్టుకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ రొటీన్ గా అనిపించడం, చప్పగా తోచే క్లైమాక్స్ నిరాశ పరుస్తాయి. స్క్రీన్ ప్లేతో మేజిక్ చేసే నీరజ్ పాండే ఈసారి తన స్థాయికి తగ్గ అవుట్ ఫుట్ ఇవ్వలేకపోయారు. మరీ తీసిపారేసేలా లేదు కానీ ప్రత్యేకంగా చెప్పడానికి కూడా ఏమి లేనంత మాములుగా ఉంది. టైటిల్ అయితే మార్చగలిగారు కానీ కంటెంట్ లోని హెచ్చుతగ్గులను కాదు.