యాంకర్ సుమ అంటే వినోదానికి కేరాఫ్ అడ్రస్. ఆమె మైక్ అందుకుందంటే నవ్వులే నవ్వులు. ఆమె ఎమోషనల్ అవడం, కన్నీళ్లు పెట్టుకోవడం అంటే అరుదైన విషయమే. శనివారం అదే జరిగింది. సుమ కొన్నేళ్లుగా ఫెస్టివల్ ఆఫ్ జాయ్స్ పేరుతో ఛారిటీ ప్రోగ్రాం చేస్తోంది. దీని ఐదో వార్షికోత్సవాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. రామ్ చరణ్ సతీమణి ఉపాసనతో పాటు అనేక మంది ప్రముఖులు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు.
ఇందులో సుమ భర్త, నటుడు రాజీవ్ కనకాల కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రాజీవ్ మాట్లాడుతూ.. సుమను ఎమోషనల్ చేసి, తానూ ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
సుమ ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తుండడం పట్ల రాజీవ్ భావోద్వేగానికి గురయ్యాడు. సుమ తన చుట్టూ ఉన్న వాళ్లందరినీ బాగా చూసుకుంటుందని.. ఇంతమంది బాధ్యత తీసుకోవడం గొప్ప విషయమని చెబుతూ.. లాంగ్ లివ్ అంటూ భార్యను ఆశీర్వదించాడు రాజీవ్. ఆమె 116 ఏళ్లు బతకాలని రాజీవ్ అన్నాడు. ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ రాజీవ్ చాలా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకోగా.. అది చూసి సుమ కూడా ఉద్వేగానికి గురైంది. ఆమె కళ్లలోనూ నీళ్లు వచ్చేశాయి.
ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే సుమ.. చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తర్వాత సుమ స్టేజ్ మీదికి వచ్చి భర్త పక్కన నిలబడగా, రాజీవ్ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. అప్పుడు మరోసారి సుమ 116 ఏళ్లు బతికి ఇలాంటి మంచి పనులు కొనసాగిస్తూ ఉండాలని రాజీవ్ ఆకాంక్షించాడు. ఈ 116 ఏంటి అంటే.. నూటపదహార్లు అంటారు కదా అని రాజీవ్ జవాబిచ్చాడు. దీనికి సుమ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ.. నేను అలా చేయాలంటే నువ్వు ముందు సినిమాల్లో చావడం ఆపేయాలి అనడంతో ఆడిటోరియం నవ్వుల్లో మునిగిపోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates