‘హనుమాన్’ను ఇబ్బందిపెట్టడంపై మహేష్ కోప్పడ్డాడా?

2024 సంక్రాంతి టైంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల భారీ సినిమా ‘గుంటూరు కారం’ మీద.. ‘హనుమాన్’ అనే చిన్న చిత్రం ఆధిపత్యం చలాయించడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. రిలీజ్ ముంగిట థియేటర్ల కేటాయింపులో ‘హనుమాన్’కు తీవ్ర అన్యాయం జరగడం మీద పెద్ద చర్చే జరిగింది. హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో కేవలం ఐదు సింగిల్ స్క్రీన్లలో మాత్రమే రిలీజైంది ‘హనుమాన్’. మల్టీప్లెక్సుల్లో కూడా మెజారిటీ షోలు ‘గుంటూరు కారం’కే ఇచ్చారు.

ఐతే రిలీజ్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఆ సినిమాకు అదిరిపోయే టాక్ రావడంతో నెమ్మదిగా థియేటర్లు పెరిగాయి. ‘గుంటూరు కారం’కు నెగెటివ్ టాక్ రావడంతో దాని థియేటర్లు తీసి ‘హనుమాన్’కు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. అంతిమంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈ విషయంలో మహేష్ బాబును సోషల్ మీడియాలో తరచుగా నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు కూడా.

ఐతే మహేష్ మాత్రం ‘హనుమాన్’ లాంటి చిన్న సినిమా అంత పెద్ద విజయం సాధించడంపై చాలా సానుకూలంగా స్పందించాడట. ఈ విషయాన్ని ‘హనుమాన్’ నిర్మాత చైతన్యరెడ్డి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. మహేష్ తమ సినిమాను, తమ టీంను మెచ్చుకున్న విషయం పీఆర్వోల ద్వారా కొంచెం ఆలస్యంగా తమకు తెలిసిందని చైతన్య చెప్పారు.

కొత్త వాళ్లు, మంచి కథ చేశారు, బాగా చేశారు అని మహేష్ తమను అభినందించినట్లు తెలిసి చాలా సంతోషించామని చైతన్య తెలిపారు. అదే సమయంలో థియేటర్ల ఎదురైన ఇబ్బంది విషయంలోనూ మహేష్ తమకు అనుకూలంగా మాట్లాడినట్లు కూడా తమకు తెలిసిందని చైతన్య చెప్పారు.

‘‘వాళ్లను ఎందుకు మీరు అంత ఒత్తిడి చేస్తున్నారు… వాళ్ల సినిమా వాళ్లను ప్రమోట్ చేసుకోనివ్వండి.. వాళ్ల మీద ఎందుకు విశ్వరూపం చూపిస్తున్నారు’’ అని మహేష్ అన్నట్లు పీఆర్వోల ద్వారా తమకు ఆలస్యంగా తెలిసిందని, అంత పెద్ద స్టార్ అలా మాట్లాడ్డం గొప్ప విషయమని చైతన్య కొనియాడారు. గుంటూరు కారం మీద హనుమాన్ పైచేయి సాధించిందని చాలామంది ఊరికే మహేష్‌ను కించపరిచేలా పోస్టులు పెడుతుంటారు కానీ.. ఓ చిన్న సినిమా అలాంటి ఫలితం అందుకోవడాన్ని మహేష్ ఎంత స్పోర్టివ్‌గా తీసుకున్నారో చెప్పడానికి ఇది రుజువు.