రామ్ చరణ్ సరసన కొత్త అందం?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటించబోతుండడంతో ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇంకా సెట్స్ మీదికి వెళ్లకముందే సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జోరందుకున్నాయి. ముందుగా సంగీత దర్శకుడి విషయంలోనే పెద్ద డిస్కషన్ నడిచింది.

సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడైన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి పని చేయడం లేదని.. తన స్థానంలోకి వేరొకరు వస్తున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముందేమో ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్ శశ్వత్ సచ్‌దేవ్ పేరు వినిపించింది. ఆ తర్వాత అనిరుధ్ రవిచందర్ పేరు తెరపైకి వచ్చింది. కానీ అధికారికంగా ఏ విషయం ఇంకా ఖరారరవ్వలేదు.
ఈలోపు ఈ సినిమాలో కథానాయిక గురించి చర్చ ఊపందుకుంది.

చరణ్‌కు జోడీగా కొత్త అందాన్ని పెట్టి ఈ సినిమాకు కొత్త లుక్ తీసుకురావాలని సుకుమార్ చూస్తున్నాడట. ‘సైయారా’ సినిమాతో దేశవ్యాప్తంగా కుర్రకారు గుండెలను దోచిన బాలీవుడ్ బ్యూటీ అనీత్ పడ్డా ఈ చిత్రంలో కథానాయికగా నటించబోతున్నట్లు ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. స్వయంగా దీని గురించి సుకుమార్ హింట్ ఇచ్చినట్లుగా ఒక వీడియో కూడా తిరుగుతోంది.

తన కొత్త చిత్రంలో హీరోయిన్ గురించి AP అనే అక్షరాలతో సుకుమార్ హింట్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అనీత్ నిజంగా ఈ సినిమాలో నటించేట్లయితే ఆమె ఈ సినిమాకు అసెట్ అవుతుందనడంలో సందేహం లేదు. మరోవైపు ‘దురంధర్’ భామ సారా అర్జున్ ఈ చిత్రంలో హీరోయిన్ అంటూ మరో ప్రచారం కూడా నడుస్తోంది. కొన్ని రోజుల కిందటే ఈ చిత్రానికి ఆఫీస్ తెరిచారు. త్వరలోనే ముహూర్త వేడుక జరగనుంది. ఈ ఏడాది చివరి లోపే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది.