రణబాలి దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ అనంతపురంలో జరిగిన సక్సెస్ మీట్ లో ఒక మంచి విషయం చెప్పారు. ఇకపై బిజినెస్ భాషలో వాడే నైజామ్, సీడెడ్ పేర్లను ఇకపై స్వచ్ఛ తెలుగులో తెలంగాణ, రాయలసీమ అని పిలుచుకుందామని పిలుపు ఇచ్చారు. తాను ఎప్పటి నుంచో ఇది చేస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే నిజ జీవితంలో అందులోనూ ఇండస్ట్రీలో ఇలా ఆచరణలో పెట్టడం సాధ్యమవుతుందా అంటే వెంటనే సమాధానం చెప్పలేని పరిస్థితి. కొన్ని చిక్కులు లేకపోలేదు.
ఇలా సీడెడ్, నైజామ్ అనడం ఈ మధ్య పుట్టుకొచ్చింది కాదు. తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఈ పదాలు వాడుకలో ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు వాటికే బాగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు మార్చే దిశగా చర్యలు చేపడితే బాగానే ఉంటుంది. సీడెడ్ ని రాయలసీమ అని పిలిస్తే అప్పుడు ఆంధ్రకు పెద్దగా ఇబ్బంది ఉండదు. అదే పేరు కొనసాగించవచ్చు. మదరాసు చెన్నైగా, కలకత్తా కోల్కతాగా, కేరళని కేరళంగా మార్చినప్పుడు మనం కూడా అలాంటివి ఛేంజ్ చేయొచ్చు.
అయినా రాహుల్ పిలుపు ఇచ్చింది వ్యావహారిక భాష గురించి కాబట్టి దీనికి అనుమతులు, జిఓలు అవసరం లేదు. ఒక్కొకరుగా వాడుతూ పోతే అదే అలవాటవుతుంది. ముఖ్యంగా నిర్మాతలు హీరోలు దర్శకులు మొదలుపెట్టాలి. ఆ తర్వాత మీడియా ఆటోమేటిక్ గా ఫాలో అవుతుంది. ఇలా చేయడం వల్ల సాంప్రదాయ తెలుగు పదాలకు జీవం పోసినట్టే. ఇకపై తీయబోయే సినిమాల్లో కూడా ఈ దిశగా మార్పులు చేసుకుంటే సాధారణ ప్రేక్షకులకు కూడా వీటిని వాడటం మొదలుపెడతారు.
ఇక రణబాలి విషయానికి వస్తే బ్రేక్ ఈవెన్ కోసం పరుగులు పెడుతున్న క్రమంలో సెలవులు అయిపోవడం కొంత ప్రభావాన్ని చూపించింది. జైలర్ 2 గట్టి పోటీ ఇవ్వడం, ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ రేంజ్ కు తగ్గ ఫలితం రాకపోవడం ప్రతికూలంగా మారాయి. అయినా సరే విజయ్ గత కొన్నేళ్లలో వచ్చిన సినిమాలతో పోలిస్తే రణబాలి చాలా మెరుగని చెప్పాలి. ముఖ్యంగా సీమ నేటివిటీని రాహుల్ ప్రెజెంట్ చేసిన తీరు. జనాలకు బాగానే కనెక్ట్ అయ్యింది. వసూళ్లు అదే చెబుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates