కల్ట్‌కు వచ్చే అసలు కష్టం అదే

విశ్వక్ సేన్ కల్ట్ అక్టోబర్ 30 విడుదలకు రెడీ అవుతోంది. ఆదర్శ కుటుంబంతో పోటీ ఎందుకు లెమ్మని ఇట్లు అర్జున, సమ్మర్ హాలిడేస్ ఆల్రెడీ బరిలో నుంచి తప్పుకోగా కల్ట్ మాత్రం వెనక్కు తగ్గే ప్రసక్తే లేదంటూ ధైర్యంగా క్లాష్ కు సిద్ధపడుతోంది. ఎలాగూ రణబాలి స్లో అవుతోంది. జైలర్ 2 కూడా క్రమంగా జోరు తగ్గిస్తుంది. గరివిడి లక్ష్మి సౌండ్ కేవలం ఉత్తరాంధ్రకే పరిమితమయ్యింది. 418 టార్గెట్ ఆడియన్స్ పరిమితం కాబట్టి మహా అయితే వన్ వీక్ కంటే ఎక్కువ రన్ ఆశించలేం.

ఇలాంటి టైంలో బాక్సాఫీస్ వద్ద స్పేస్ దొరుకుతుంది. దాన్ని వాడుకునే ఉద్దేశంతోనే కల్ట్ నెలాఖరుకు దింపుతున్నాడు విశ్వక్. అయితే స్లాషర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీలో భయంకరమైన హత్యలు, సంఘటనలు ఉంటయని ట్రైలర్ లో ముందే చెప్పేశారు. అడల్ట్స్ ఓన్లీ అంటూ విశ్వక్ పదే పదే నొక్కి చెబుతున్నాడు. సో ఇప్పుడు సెన్సార్ రూపంలో ఎదురయ్యే ఇబ్బంది విశ్వక్ ఎలా ఎదురుకుంటాడనేది పరిశ్రమ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇక్కడ లాభనష్టాలు రెండూ ఉన్నాయి.

ఎలాగూ ఏ సర్టిఫికెట్ తీసుకోవడానికి విశ్వక్ రెడీ అయ్యాడు కాబట్టి ఒక సమస్య తీరినట్టే. కాకపోతే కట్స్, బ్లర్స్ ఎక్కువ చెబితే మాత్రం కంటెంట్ లో ఇంటెన్సిటీ మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే హింసలో లోతుని జనం ఫీలవ్వాలంటే అది పచ్చిగానే ఉండాలి. ప్యారడైజ్, రణబాలి విషయంలో సెన్సార్ కాసింత ఉదారత చూపించిన నేపథ్యంలో కల్ట్ కి మరీ ఎక్కువ అభ్యంతరాలు రాకపోవచ్చు. మహా అయితే రక్తపాతాన్ని తగ్గించమని ఒకటి రెండు రికమండేషన్లు చేయొచ్చు.

ఇతర దర్శకులు తనకు హిట్లు ఇవ్వలేకపోతున్నారని మరోసారి మెగా ఫోన్ పట్టుకున్న విశ్వక్ సేన్ కు కల్ట్ మంచి హిట్ అయితే కేవలం ఇరవై రోజుల గ్యాప్ లో వచ్చే ఈ నగరానికి ఏమైంది 2 కి ప్లస్ అవుతుంది. అటుపై డిసెంబర్ లో లెగసితో వస్తున్నాడు కాబట్టి వీటికి పునాది వేయాల్సిన బాధ్యత కల్ట్ మీదే ఉంది. ఎంత వయొలెన్స్ ఉన్నా దానికో సహేతుకమైన కారణం ఉంటుందని, అది తెరమీద చూశాక షాక్ తో పాటు కన్విన్స్ అవుతారని హామీ ఇస్తున్నాడు. ఆ నమ్మకం నిలబడితే మంచిదే.