జైలర్ 2, రణబాలి లాంటి క్రేజీ సినిమాలతో పోటీ పడి చాలా పెద్ద రిస్కు చేసిన గరివిడి లక్ష్మి రికార్డులు బద్దలు కొట్టే ఫలితం అందుకుంటుందని ఎవరూ అనుకోలేదు కానీ ఇలాంటి ప్రయత్నాలకు ప్రేక్షకుల అండదండలు దొరికితే చాలనుకున్నారు. అయితే ఉత్తరాంధ్ర వీక్ డేస్ లో అనూహ్యంగా రజనీకాంత్, విజయ్ దేవరకొండలను డామినేట్ చేసే స్థాయిలో ఆనంది వసూళ్లు సాధించడం ట్రేడ్ వర్గాలను నివ్వెరపోయేలా చేసింది. నిన్న మొన్న ఆంధ్ర సైడ్ డెబ్భై శాతం పైగా ఆక్యుపెన్సీ నమోదు చేసిన మూవీ ఇదొక్కటే.
కాంపిటీషన్ వల్ల సరిపడా థియేటర్లు దొరకనప్పటికీ ఉన్నవాటికే జనం ఎగబడటంతో వైజాగ్ నుంచి విజయనగరం, శ్రీకాకుళం నుంచి పర్లాకిమిడి దాకా చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. గరివిడి లక్ష్మి గురించి సీడెడ్ లో అవగాహన తక్కువ కాబట్టి వసూళ్లు ఏమంత ఆశాజనకంగా లేవు. నైజామ్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ జైలర్ 2, రణబాలి డామినేట్ చేస్తున్నాయి. ఈ వారం 418 హారర్ మూవీ తప్ప వేరే ఆప్షన్ లేకపోవడంతో ఇంకో వీకెండ్ అడ్వాంటేజ్ దక్కనుంది.
మొత్తానికి గరివిడి లక్ష్మి గర్వంగా చెప్పుకునే ఘనత అయితే సాధించింది. దర్శకుడు గౌరీ నాయుడు, రాగ్ మయూర్, ఆనంది విస్తృతంగా చేసిన ప్రమోషన్లు బాగా ఉపయోగపడ్డాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి బహుశా అవార్డులు తెచ్చే సినిమా ఇదే అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బయట ప్రపంచానికి తెలియాల్సిన లక్ష్మి లాంటి కథలు మరికొన్ని తెరమీదకు రావాల్సిన అవసరం చాలా ఉంది. వీటి వల్ల టాలెంట్ ఉన్న ఎందరికో స్ఫూర్తి దక్కుతుంది.
థియేటర్ రన్ ఇంకో వారం పది రోజులు కొనసాగించనున్న గరివిడి లక్ష్మి ఓటిటిలో వచ్చాక భారీ వ్యూస్ సొంతం చేసుకోవడం ఖాయం. డీల్ ముందే అయిపోవడం వల్ల దసరాకు విడుదల చేశారని టాక్. అయితే పబ్లిసిటీ పరంగా ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఉంటే బాగుండేదని డిస్ట్రిబ్యూటర్ వర్గాల అభిప్రాయం. మరింత జనాలకు చేరువయ్యేదని, అయినా సరే ఇప్పటిదాకా సాధించిన వసూళ్లు చూస్తే ఇది చెప్పుకోదగ్గ మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. కొందరు బయ్యర్లకు ఇది లాభాల పంట పండించనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates