ఆ సినిమా ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే..

ప్రేమద ఊరలి.. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన కన్నడ చిత్రమిది. గత నెల ఈ సినిమా రిలీజైనపుడు మొదట్లో దీని మీద పెద్దగా చర్చ లేదు. కానీ తర్వాత ప్రేక్షకుల్లోకి సినిమా బాగా వెళ్లిపోయింది. కన్నడిగులు నెల రోజులుగా విరగబడి చూస్తున్నారీ సినిమాను. ఏకంగా వంద కోట్ల వసూళ్ల మార్కును ఈ సినిమా అందుకుంది. ‘టాక్సిక్’ లాంటి భారీ చిత్రాన్ని దాటి ఈ ఏడాది కన్నడలో హైయెస్ట్ గ్రాసర్‌గానూ నిలిచింది.

ఈ సినిమా చూసి కన్నడ ప్రేక్షకులు కదిలిపోతున్నారు. థియేటర్లలో వాళ్ల ఎమోషన్ చూస్తే.. ఒక సినిమా ఇంతగా జనాలను ప్రభావితం చేస్తుందా అనిపిస్తోంది. ఇందులో మరీ గొప్ప కథేమీ ఉండదు. సగటు ఫ్యామిలీ డ్రామానే. కానీ దానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా బయట కూడా జనాల మీద ఎంతగా ప్రభావం చూపిస్తోందో చెప్పడానికి ఓ ఉదాహరణను చెప్పుకోవాలి.

‘ప్రేమద ఊరలి’ సినిమా చిత్రీకరణ జరుపుకున్న ప్రాంతాలు ఇప్పుడు కన్నడ నాట బాగా పాపులర్ అయిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమాలో చూపించే సీగెగుడ్డ అనే ఆధ్యాత్మిక ప్రాంతం ఇప్పుడు జనాలతో కిటకిటలాడుతోంది. హసన్‌కు దగ్గర్లోని ఈ ప్రాంతం అంతకుముందు అంత పాపులర్ కాదు. కానీ ‘ప్రేమద ఊరలి’ రిలీజయ్యాక అది పెద్ద టూరిజం ప్లేస్‌లా మారిపోయింది. జనం విపరీతంగా వస్తుండడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి.

ఈ హిల్ స్టేషన్‌లో మునుపెన్నడూ చూడని జనం కనిపిస్తున్నారు. ఇక్కడి గుడిలో కూడా జనసందోహం బాగా పెరిగింది. కొందరు దీనిపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కూడా. ఇంతకుముందు ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉండేదని.. కానీ ఇప్పుడు జనం విరగబడి వస్తుండడంతో ఆ ప్రశాంతత అంతా పోయిందని స్థానికులు అంటున్నారు. కానీ ఇక్కడ వ్యాపారాలు మాత్రం బాగా జరుగుతుండడంతో వాళ్లు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.