కథ ఎక్కడ జరిగినా సరే, అందులో ఏ ప్రాంత భాష, యాస ఉన్నా సరే.. అన్ని ప్రాంతాల వాళ్లూ చూస్తేనే సినిమాకు మంచి ఫలితం వస్తుంది. ‘పుష్ప’ కథ చిత్తూరులో జరిగినా, పాత్రలన్నీ అక్కడి యాసనే మాట్లాడినా సరే.. ఆ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ఆదరణ దక్కింది. అది పాన్ ఇండియా స్థాయిలోనూ సూపర్ సక్సెస్ అయింది.
‘కాంతార’ కూడా అంతే. అది కర్ణాటకలో ఒక ప్రాంతానికి సంబంధించిన కథ. ఇక్కడ కథకు ప్రాంతంతో ముడిపెట్టి.. సినిమా పరిధిని తగ్గించే ప్రయత్నం ప్రేక్షకులు చేయలేదు. కానీ ఈ మధ్య తెలుగులో కొన్ని సినిమాలను ఆదరించే విషయంలో కొన్ని ప్రాంతాలు ముందుంటున్నాయి. కొన్ని ప్రాంతాలు వెనకబడుతున్నాయి. ఈ విచిత్రమైన ట్రెండు.. టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారుతోంది.
గత నెలలో వచ్చిన నేచురల్ స్టార్ నాని మూవీ ‘ది ప్యారడైజ్’ ప్రపంచంలో మిగతా అన్ని ఏరియాల్లోనూ డిజాస్టర్ అయింది కానీ.. తెలంగాణలో మాత్రం బ్రేక్ ఈవెన్ అయింది. ఈ ప్రాంత ప్రేక్షకులు ఈ సినిమాను ఓన్ చేసుకుని ఆదరించారు. ఇది తెలంగాణ రూటెడ్ స్టోరీ కావడం అందుకు ఒక కారణం కాగా.. కేసీఆర్ పాత్ర ఉండడం వల్ల కూడా ఇక్కడి వాళ్లు కనెక్ట్ అయి బాగానే సినిమా చూశారు. కానీ మిగతా చోట్ల అంతా సినిమా బోల్తా కొట్టింది. ఇక వర్తమానంలోకి వస్తే.. దసరాకు వచ్చిన రెండు సినిమాలకు కూడా సెలక్టివ్ అప్రిషియేషన్ కనిపిస్తోంది.
విజయ్ దేవరకొండ సినిమా ‘రణబాలి’ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రాయలసీమలో చాలా బాగా ఆడింది. ఇది అనంతపురం నేపథ్యంలో నడిచే కథ. భాష, యాస కూడా ఈ ప్రాంతానికి అనుగుణంగానే ఉంటుంది. మొదట్లో వచ్చిన టాక్ చూసి డిజాస్టర్ అనుకుంటే.. ఈ సినిమా బలంగానే నిలబడింది. ముఖ్యంగా రాయలసీమలో ఈ సినిమా చాలా బాగా ఆడింది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కూడా అయి లాభాలు కూడా అందిస్తోంది. మిగతా ఏరియాల్లో కూడా సినిమా పర్వాలేదనిపిస్తోంది కానీ.. సీమ స్థాయిలో మాత్రం లేదు.
ఇక ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘గరివిడి లక్ష్మి’కేమో ఉత్తరాంధ్రలో గొప్ప ఆదరణ దక్కుతోంది. వీకెండ్లో, దసరా రోజు ఈ సినిమాకు ఆ ప్రాంతంలో చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఇప్పటికే దాదాపు రెండున్నర కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్ వచ్చిందీ సినిమాకు ఉత్తరాంధ్రలో. ఈ సినిమా రేంజికి అది పెద్ద మొత్తమే.
మిగతా ఏరియాల్లో సినిమాకు స్పందన అంత గొప్పగా లేదు. ఇలా ఏ ప్రాంతం వాళ్లు ఆ ప్రాంతం సినిమాను ఆదరించే ఈ ట్రెండు సినిమాకు మంచో చెడో అర్థం కాని పరిస్థితి. తమ సినిమాలు ఒక చోట అయినా బాగా ఆడాయని సంతోషించాలా.. లేక ఇలా సినిమాలను ప్రాంతాలకు పరిమితం చేస్తున్నారే అని బాధ పడాలో తెలియట్లేదు ఫిలిం మేకర్లకు.
Gulte Telugu Telugu Political and Movie News Updates