పెళ్లి గురించి హనుమాన్ హీరో క్లారిటీ

టాలీవుడ్లో యువ కథానాయకులు ఒక్కొక్కరుగా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అల్లు శిరీష్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఇద్దరు యువ కథానాయకుల పెళ్లి గురించి వార్తలు బయటికి వచ్చాయి. అందులో ఒకరు సాయిధరమ్ తేజ్ కాగా.. ఇంకొకరు తేజ సజ్జ.

తేజు తన చిన్ననాటి స్నేహితురాలిని త్వరలో పెళ్లాడబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు తేజ సజ్జ వివాహం డిసెంబరులో జరగనున్నట్లు రూమర్లు వినిపించాయి. ఈ విషయంలో ఇప్పుడు తేజ సజ్జ ఓపెన్ అయ్యాడు. తన పెళ్లి వార్తను అతను ధ్రువీకరించాడు. నిశ్చితార్థం, పెళ్లి, వధువు, వేదికకు సంబంధించి అతను సమాచారాన్ని పంచుకున్నాడు.

డిసెంబరులో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో తాను డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు తేజ వెల్లడించాడు. నవంబరులో నిశ్చితార్థం జరుగుతుందన్నాడు. వధువు పేరేంటన్నది వెల్లడించలేదు కానీ.. తమది పెద్దలు కుదిర్చిన పెళ్లే అని.. వధువుకు సినీ పరిశ్రమతో సంబంధం లేదని అతను తెలిపాడు. తనకు కాబోయే భార్య కుటుంబం టెక్నాలజీ బిజినెస్‌లో ఉన్నట్లు తేజ చెప్పాడు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహిస్తామని తేజ తెలిపాడు.

చిన్నతనంలో ‘ఇంద్ర’ సహా అనేక పెద్ద సినిమాల్లో బాల నటుడిగా ఆకట్టుకున్నాడు తేజ. ఆ తర్వాత అతను ‘ఓ బేబీ’ చిత్రంలో ప్రత్యేక పాత్రతో రీఎంట్రీ ఇచ్చాడు. ఆపై ఇష్క్, జాంబిరెడ్డి చిత్రాల్లో హీరోగా నటించాడు. తేజకు ‘హనుమాన్’ పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆపై ‘మిరాయ్’ కూడా పెద్ద హిట్టయింది. ఇప్పుడు అతను ‘జాంబిరెడ్డి-2’తో పాటు ‘మిరాయ్-2’ లాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో పని చేస్తున్నాడు. ఇటీవలే అతను హోస్ట్‌గా ‘ట్రైటర్స్’ అనే షో కూడా అమేజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది.